YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏర్పాటు సరే.. వసతులేవీ..?

ఏర్పాటు సరే.. వసతులేవీ..?

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

గోదావరిఖని ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్‌ కేంద్రంలో కనీస వసతులు కరవయ్యాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో కనీసం మరుగుదొడ్లు, మూత్రశాలలు సైతం లేకపోవడంతో సిబ్బందితో పాటు రోగులు, వారి బంధువులు ఇబ్బంది పడుతున్నారు. రక్తశుద్ధి కేంద్రం తప్పనిసరిగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే ఉండాల్సి ఉండగా ఇక్కడ మాత్రం మొదటి అంతస్థులో ఉంది. దీంతో ఎక్కలేక, దిగలేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. లిఫ్టు సదుపాయం ఉంటేనే పై అంతస్థుల్లో రక్తశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంలో సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్రంలో అయిదు పడకలుండగా ఒకదాన్ని హెచ్‌ఐవీ, హెపటైటిస్‌-బి తదితర వ్యాధిగ్రస్థుల కోసం కేటాయించారు. మిగతా నాలుగు పడకలను మాత్రం రక్తశుద్ధి కోసం వచ్చే వారికి వినియోగిస్తున్నారు. ఒక్కొక్కరికి రక్తశుద్ధి చేసేందుకు దాదాపు 4 గంటలు పడుతుండగా ఏర్పాట్ల కోసం మరో గంట అదనంగా అవసరం. ఈ లెక్కన ఒక్కొక్క డయాలిసిస్‌కు అయిదు గంటలు పడుతోంది. ఇలా మూడు షిఫ్టుల్లో నాలుగు పడకల్లో 12 మందితో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడకలో మరో ఒకరిద్దరికి నిత్యం రక్తశుద్ధి చేస్తుంటారు. ఆసుపత్రిలో ప్రతిరోజూ 39 మంది రక్తశుద్ధి చేయించుకుంటుడగా అందులో రోజు విడిచి రోజు వచ్చే వారే అధికం. అదనంగా మరిన్ని పడకలను ఏర్పాటు చేయడమో, నాలుగో షిఫ్టును నడిపించడమో చేస్తేనే అవస్థలు తీరతాయి. నాలుగో షిప్టు నడిపినా అర్ధరాత్రి డయాలిసిస్‌ తర్వాత వారు ఇళ్లకు వెళ్లడమూ సమస్యే. ప్రస్తుతమున్న అయిదు పడకలకే ఇద్దరు టెక్నీషియన్లు, మరో ఇద్దరు జూనియర్‌ టెక్నీషియన్లు, ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, ఒక ఇన్‌ఛార్జి కలిపి మొత్తం ఏడుగురు ఉండాలి. కాగా ప్రస్తుతం కేవలం ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఇద్దరు టెక్నీషియన్లు మాత్రమే పని చేస్తున్నారు.
రక్తశుద్ధి కేంద్రానికి నిరంతర విద్యుత్తు సరఫరా తప్పనిసరి. కేంద్రం మంజూరు సమయంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేసే జనరేటరు ఉన్నా కరెంటు పోయిన వెంటనే దాన్ని ఆన్‌ చేయడం లేదు. దీంతో శరీరంలోంచి శుద్ధి కోసం తీసిన రక్తాన్ని శుద్ధి చేయకుండానే తిరిగి ఎక్కించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక షిప్టులో విద్యుత్తు అంతరాయం ఏర్పడితే ఆ షిఫ్టులో రక్తశుద్ధి చేయించుకునే వారు మరో రెండు రోజులు ఆగాల్సి వస్తోంది. ఈలోగా ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే ఆస్కారముంటుంది. ఇటీవల ఆరు గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రక్తశుద్ధి సేవలు నిలిచిపోయాయి. అలాగే సరఫరాలో హెచ్చుతగ్గులతో రెండు రోజుల కింద ఓ యంత్రం చెడిపోయి, రక్తశుద్ధి నిలిచిపోయింది.

Related Posts