యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వంశధార నిర్వాసితుల ఓటు కష్టాలు మాత్రం తీరడం లేదు. వీరి ఓట్లను ఇతర గ్రామాలకు బదిలీ చేశారు. అయితే తమ ఓటు ఎక్కడుందో తెలియని వారు కొంత మంది ఉండగా.. తాము కోరిన చోటకు బదిలీ కోసం దరఖాస్తు అందజేస్తున్నా ఫలితం లేదని మరికొంత మంది.. అధికారులు సరైన చర్యలు తీసుకోకుంటే సార్వత్రిక ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల్లో తాము ఓటు హక్కు వినియోగించుకోలేకపోతామని ఆందోళన చెందుతున్నారు.
కొత్తూరు మండలంలోని ఇరపాడ, కృష్ణాపురం, అడవి కొత్తూరు, పెద్దమడి, గూనభద్ర గ్రామాల నిర్వాసితులు అదే మండలంలో గ్రామాల సమీపంలోని ఆర్‌ఆర్ కాలనీల్లో స్థిరపడ్డారు. ఇక్కడికి వీరి ఓటుహక్కు బదిలీలో పెద్దగా మార్పులేదు. ఎల్‌ఎన్‌పేట మండలం పెద్దకొల్లివలస, హిరమండలం మండలం చిన్నకొల్లివలస, గార్లపాడు గ్రామస్థులు అధికశాతం మంది ఒకేచోటికి తరలివెళ్లడంతో పెద్దగా ఇబ్బంది లేదు.
నిర్వాసితుల ఓట్లను రద్దు చేయకూడదనే ఉద్దేశంతో నిర్వాసితులు అధికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు రెవెన్యూ అధికారులు బదిలీ చేశారు. అయితే ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస ఆర్‌ఆర్ కాలనీ మినహా గరిష్ఠంగా ఓట్లన్నీ పాతపట్నం నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకే బదిలీ చేశారు. నిర్వాసితులు ఉండేది ఒకచోట, ఓటుహక్కు నమోదై ఉన్నది మరోచోట కాబట్టి.. దాదాపు 50 శాతం మందికి పైగా ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం అవకాశం ఉంది. చాలా మంది నిర్వాసితులు ఎల్‌ఎన్‌పేట మండలంలో నివాసాలు ఏర్పాటు చేసుకోగా.. వారి ఓట్లను మాత్రమ కొత్తూరు మండలానికి బదిలీ చేయడం గమనార్హం. హిరమండలం నుంచి 8160 ఓట్లు ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు మండలాలకు బదిలీ చేశారు.