యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఉద్యమాలే ఊపిరిగా మసలిన కమ్యూనిస్టులకు క్షేత్రస్థాయిలో బలమైన పునాదులు ఉన్నప్పటికీ.. ఎన్నికల రాజకీయాల్లో మాత్రం ఓటు బ్యాంకు అంతంత మాత్రంగానే ఉండడం గమనార్హం. బలమైన ప్రజా అభిమానం ఉండి కూడా ఈ అభిమానాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో ఎప్పటికప్పుడు కుంచించుకుపోయిన ఈ పార్టీలు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తమకు బాసటగా ఉండే పార్టీలను ఎంచుకోవడం, తమకు అనుకూలంగా ఉండే పార్టీలకు జై కొట్టడం `షరా` మామూలే అన్నవిధంగా మారిపోయింది. దీంతో కమ్యూనిస్టుల ఎన్నికల రాజకీయాలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి మారిపోతుంటాయి. ఒక్క బీజేపీతో తప్ప అన్ని పార్టీలతోనూ కమ్యూనిస్టులకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి.ఏపీ విషయానికి వస్తే.. గతంలో కాంగ్రెస్‌తో ఢీకొట్టి.. అప్పటి ఎన్టీఆర్‌కు జైకొట్టాయి. ఆ తర్వాత ఇదే బాట సాగించినా.. అనుకూల పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంలో కాంగ్రెస్‌తో జట్టు కట్టి యూపీఏలో భాగస్వామలు అయ్యాయి. ఆ తర్వాత రాష్ట్రంలోనూ చంద్రబాబుతో జట్టుకట్టాయి. అయితే, అంశాల వారీగా మద్దతిచ్చి.. తర్వాత విభేదాల కారణంగా బయటకు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2014లో ఒంటరిగానే పోరుకు దిగిన ఈ పార్టీలు ఒక్క సీటును కూడా ఏపీలో కైవసం చేసుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జనసేనతో జట్టుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్‌కు జైకొట్టి.. ఆయన పంచన చేరిపోయాయి. పవన్ కూడా తనకు కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఇష్టమని చెప్పడం వీరికి కలిసి వచ్చింది. పవన్‌తో కలిసి ముందుకు నడుస్తున్న కమ్యూనిస్టులు ఇప్పుడు పూర్తిగా పవన్‌పైనే ఆధారపడ్డాయా? అనే ప్రశ్న కూడా తలెత్తేలా వ్యవహరిస్తుండడం గమనార్హం. కనీసం 10 స్థానాల్లో అయినా రెండు పార్టీలు సీపీఎం, సీపీఐలు పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే ఒక విడత దీనిపై చర్చ కూడా జరిగిపోయింది. అయితే, ఇంకా కొలిక్కిరాలేదు. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ జిల్లాల్లో కొంత బలం ఉన్న నేపథ్యంలో కమ్యూనిస్టులు ఆయా జిల్లాల్లోనే టికెట్లను ఆశిస్తున్నారు. పవన్‌తో చేరడం ద్వారా తమ ఎన్నికల వ్యూహం సక్సెస్ అవుతుందనే కోణంలో కమ్యూనిస్టులు ఉన్నారు. అయితే, ఇన్ని సీట్లు వీరికి ఇస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. మరి పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మొత్తానికి ప్రజల కోసం, ప్రజల చేత పోరాడే పార్టీలకు ఎన్నికల్లో బలం లేకపోవడంతో ప్రస్తుత పరిస్థితి ఇలా మారిందనేది నిర్వివాదాంశం.