YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలోకి కిషోర్ చంద్రదేవ్

 టీడీపీలోకి కిషోర్ చంద్రదేవ్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఉత్తరాంధ్రాలో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశాక ఏ పార్టీలో చేరతారనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కిశోర్‌ చంద్రదేవ్‌ ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఒకసారి రాజ్యసభ సభ్యునిగా చేశారు. దాదాపు 30 ఏళ్లు ఆయన పార్లమెంటులో గడిపారు. విజయనగరం జిల్లా కురుపాం రాజుగా అందరికీ తెలిసిన కిశోర్‌ చంద్రదేశ్‌ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాదే ఫిబ్రవరి 15న జన్మించారు. 1977లో మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన కొండ దొర సామాజికవర్గం. ఎస్టీ రిజర్వ్‌డ్‌ లోక్‌సభ స్థానం పార్వతీపురం నుంచి గతంలో పోటీ చేశారు. ఆ తరువాత అరకులోయ నియోజకవర్గం ఏర్పాటుకాగా 2009లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచారు.ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ఆయనకు సహాయ మంత్రి పదవి లభించింది. మైన్స్‌, స్టీల్‌, కోల్‌ మంత్రిగా చేశారు. ఆ తరువాత 2011-14 మధ్య రాజ్యసభ సభ్యునిగా చేశారు. అప్పుడు కేంద్ర గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వరించారు. ఆయనకు ముక్కుసూటి మనిషిగా పేరుంది. సొంత పార్టీ నిర్ణయాలు, నాయకులను కూడా వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తే ఓడిపోతానని కచ్చితంగా తెలిసినా పార్టీ ఆదేశం మేరకు బరిలో దిగారు. వైసీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తరువాత ఇప్పటివరకు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగారు. పార్టీలో సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తంచేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా కిశోర్‌చంద్రదేవ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపాయి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పనిచేస్తానని ఆయన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అంటే రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీతో ఆయన కలిసి పనిచేస్తారని పరోక్షంగా చెప్పినట్టు అయిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో అధికార పక్షం(తెలుగుదేశం) ఒక్కటే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో కిశోర్‌ చంద్రదేవ్‌ తెలుగుదేశంలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే అరకులోయ ఎంపీ అభ్యర్థి ఆయనే అవుతారని, అందులో అనుమానం అవసరం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాను ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తానని కిశోర్‌చంద్రదేవ్‌ ప్రకటించినందున రాజకీయంగా కీలకంగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఆయన రాకను తెలుగుదేశం వర్గాలు ఆహ్వానిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబుతో చర్చలు జరిగినట్టు, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Related Posts