యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై చేసిన ట్వీట్స్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఆమె ప్రధానంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. అమిత్ షా మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికలు మోడీకి, ప్రతిపక్షాలకు మధ్య జరుగుతాయని ప్రకటించారని, మిత్రపక్షాలైన ఎన్‌డీఏ కూటమి పార్టీల అవసరం లేకుండానే మోడీ నేతృత్వంలోని బీజేపీ మెజారిటీ సీట్లను గెలుస్తుందనే ధీమా అమిత్‌షా మాటల్లో ధ్వనిస్తోందని విజయశాంతి ట్వీట్ చేశారు.ఇలా ఒక వ్యక్తి చుట్టూ బీజేపీ పార్టీని తిప్పడం వల్లే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా దూరమైపోయారని, మోదీ ఆధిపత్య ధోరణిని తట్టుకోలేక ఎన్‌డీఏ నుంచి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ వైదొలిగిందని విజయశాంతి ట్వీట్ చేశారు. ఇంత జరిగినా.. మిత్రపక్షాలను లెక్కచేయని విధంగా మోదీని షా స్థుతించడం వారి నిరంకుశత్వానికి అద్దం పడుతుందని ఆమె ట్వీట్ చేశారు. అమిత్ షా ప్రకటనపై శివసేన ఎలా స్పందిస్తుందో చూడాలని విజయశాంతి చేసిన ట్వీట్ ఎన్‌డీఏ మిత్రపక్షాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చకు దారితీసింది.