యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయ. ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఆదివారం నాడు ధ్వజారోహణం(కుంబలగ్నం) పెద్దశేష వాహనం, సోమవారం నాడు చిన్నశేష వాహనం,హంస వాహనం, మంగళవారం నాడు సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం, బుధవారం నాడు కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, గురువారం నాడు పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం, శుక్రవారం నాడు హనుమంత వాహనం స్వర్ణరథం,గజ వాహనం, శనివారం నాడు సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, ఆది వారం నాడు రథోత్సవం, అశ్వవాహనం, సోమవారం నాడు చక్రస్నానం, ధ్వజావరోహణం జరగనుంది.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.
ఫిబ్రవరి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 21వ తేదీ గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.00 నుండి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం 11.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలైన తిరుప్పావడ, కళ్యాణోత్సవంలను టిటిడి రద్దు చేసింది.