యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రాష్ట్ర ప్రోహిబిషన్, ఎక్సైజ్ కమీషనర్‌గా సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పాలనా పరమైన బదిలీలలో భాగంగా ఇప్పటి వరకు పర్యాటక, భాషా, సాంస్కృతిక, పురావస్తు శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయనను ప్రభుత్వం ఎక్సైజ్‌కు బదిలీ చేసింది. అయితే పర్యాటక శాఖ కార్యదర్శిగా మీనా పూర్తి అదనపు బాధ్యతలలో ఉంటారు. మంత్రి వర్గ సమావేశం, శాసనసభ సమావేశాల నేపధ్యంలో సచివాలయంలోని తన ఛాంబర్‌లో సిటిసి (సర్టిఫికెట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ చార్జ్) పై సంతకం చేసిన మీనా అధికారులతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. 1998 బ్యాచ్‌కు చెందిన మీనా తన పదవీ కాలంలో నెల్లూరు, విశాఖపట్నంలలో అసిస్టెంట్ కలెక్టర్, ఐటిడిఎ పిఓ, కర్నూలు జాయింట్ కలెక్టర్, ప్రకాశం - కర్నూలు కలెక్టర్, భూసంస్కరణల విభాగం ప్రాజెక్టు డైరెక్టర్, సిఎస్‌కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, విశాఖపట్నం నగర పాలక సంస్ధ కమీషనర్, క్రీడాభివృద్ది సంస్ధ ఎండి, ఖనిజాభివృద్ది సంస్ధ ఎండి, రాష్ట్ర విభజన వంటి అత్యంత కీలక సమయంలో హైదరాబాద్ కలెక్టర్, జిఎడి కార్యదర్శి పదవులలలో మీనా రాణించారు. ఎక్సైజ్ కమీషనర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పోరేషన్ నిర్వహణ సంచాలకులుగా కూడా మీనా వ్యవహరించనుండగా దానికి సంబంధించిన బాధ్యతలను కూడా శుక్రవారమే తీసుకున్నారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ ఎన్నికల సమయం ఆసన్నమైన నేపధ్యంలో మరింత సమర్ధవంతంగా విధులు నిర్వహించవలసి ఉందన్నారు. సిబ్బంది సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని, ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యవస్ధను నడపటంలో తాను ప్రతి ఒక్కరి సహకారాన్ని ఆశిస్తున్నానని స్పష్టం చేసారు. కమీషనర్‌గా మీనా పూర్వానుభవాలను గుర్తు చేసుకోగా నాటి అధికారులను పేరుపేరునా పలకరిస్తూ వచ్చారు. కార్యక్రమంలో ఎక్సైజ్ విభాగపు జాయింట్ కమీషనర్ చంద్రశేఖర్ నాయిడు, అదనపు కమీషనర్ భాస్కర్ , ఓఎస్‌డి నాగేశ్వరరావు, జిఎం వల్లభ శ్రీష, డిజిఎంలు ఆంజనేయ ప్రసాద్, వేణు గోపాల రావు, సత్య ప్రసాద్, పర్యాటక అధికారులు ప్రభాకర్, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.