యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 16న మోదీ విశాఖలో పర్యటించాల్సి ఉంది. అయితే, అదే రోజున ఇతర కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉండటంతో విశాఖ పర్యటన వాయిదా వేసినట్టు బీజేపీ నేతలు తెలిపారు. ఈ మేరకు బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు సమాచారం అందజేసింది. అలాగే ప్రధాని పర్యటన 27వ తేదీకి వాయిదా పడినట్లు పీఎంవో గురువారం ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని సభకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానాన్ని కేటాయించాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. ఇదే అంశంపై ఆయన గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. వీటితో పాటు నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, పోర్టు స్టేడియంలను కూడా బీజేపీ నాయకులు పరిశీలించారు. ముందు జాగ్రత్తగా వాటికి కూడా దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు, ఫిబ్రవరి 10న ప్రధాని మోదీ గుంటూరులో పర్యటించనున్నారు. వాస్తవానికి జనవరి 6నే మోదీ ఏపీలో పర్యటించాల్సి ఉండగా, అది వాయిదా పడింది. ఫిబ్రవరి 10, 16 తేదీల్లో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైతం పర్యటిస్తున్నారు. మూడు విడతలుగా ఏపీలో అమిత్ షా పర్యటన ఉండగా, ఇప్పటికే ఉత్తరాంధ్రలో షా పర్యటించారు. సత్యమేవ జయతే పేరుతో ఏపీలో బీజేపీ చేపట్టిన బస్సు యాత్ర నాలుగు రోజుల కిందటే ప్రారంభమైంది. ఈ యాత్ర ఫిబ్రవరి 10కి గుంటూరుకు చేరనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అక్కడ పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు నేరుగా మోదీ ఢిల్లీ నుంచి గుంటూరు చేరుకుంటారు.