యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఆసక్తి లేదన్నారు. 2014లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా తనకు కైకలూరు సీటు కేటాయించారని తెలిపారు. వెంకయ్యనాయుడు కోరడంతోనే సిట్టింగ్ స్థానాన్ని టీడీపీ వదులుకుని తనకు ఇచ్చిందన్నారు. ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రిగా పనిచేయడం తనకు పూర్తి సంతృప్తి ఇచ్చిందన్నారు. 2014లో ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కేబినెట్‌లోకి తీసుకున్నారు. కామినేని పనితీరుపై చంద్రబాబు ఎన్నోసార్లు ప్రశంసలు కురిపించారు. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా టీడీపీ-బీజేపీ పొత్తుకు బీటలు రావడంతో మరో మంత్రి మాణిక్యాలరావుతో కలిపి ఆయన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇతర బీజేపీ నేతల్లా ఎప్పుడూ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయలేదు. దీంతో కామినేని టీడీపీలో చేరనున్నారంటూ కొంతకాలం ప్రచారం జరిగింది. దీనిపై ఆయన ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. టీడీపీ నేతల విమర్శలను తిప్పికొట్టడంతో రాష్ట్ర నేతలు విఫలమవుతున్నారు. దీంతో ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలుచుకుంటుందా? అన్నది అనుమానంగానే ఉంది. ఈ క్రమంలోనే కొందరు బీజేపీ నేతలు సైకిలెక్కడానికి రంగం సిద్ధం చేసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన కామినేని ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సుముఖంగా లేరని, అలాగని బీజేపీ తరపున పోటీచేసి పరువు పోగొట్టుకోవాలని కూడా అనుకోవడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.