YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దళారీ దందా

Highlights

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వ్యవసాయ మార్కెట్లలో మాఫియాను తలపించేలా దళారులు రాజ్యం చేస్తున్నారు. మార్కెట్‌ మాయాజాలంలో రైతులు నిలువునా మోసపోతున్నారు. వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు కుమ్మక్కై అన్నదాతల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధర రాక దిగాలుపడిన రైతన్నలు.. ప్రస్తుతం సీసీఐ ద్వారా రూ.5450 ధర లభిస్తున్నా దానిని  పొందలేక రూ.5300లకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచే పత్తి సాగు చేసిన రైతులకు అప్పులిచ్చి వలలో వేసుకోవడం.. ఆ తర్వాత రైతులు పండించిన పత్తి పంటను రైతుల నుంచి దళారుల పేరుతో నేరుగా జిన్నింగ్‌ మిల్లుల వ్యాపారులకు విక్రయించడం ఆనవాయితీగా మారింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఏళ్ల తరబడి కమీషన్‌ ఏజెంట్ల చేతిలో చిక్కి తీవ్రంగా నష్టపోతున్నా.. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడానికి అధికారులెవరూ సాహసం చేయలేకపోతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 963 మంది ట్రేడర్లు ఉండగా.. 590 మంది కమీషన్‌ ఏజెంట్లు ఉన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 354 మంది వ్యాపారులు (ట్రేడర్స్‌) ఉండగా.. 389 మంది కమీషన్‌ ఏజెంట్లు ఉన్నారు. ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు పరిధిలోనే 292మంది కమీషన్‌ ఏజెంట్లు ఉండగా.. ఇచ్చోడలో 41మంది, బోథ్‌లో 25మంది, జైనథ్‌లో 24మంది కమీషన్‌ ఏజెంట్లు ఉన్నట్లు మార్కెట్‌ అధికారుల లెక్కలు చెబుతున్నారు. నిర్మల్‌ జిల్లాలో 257 మంది ట్రేడర్లుండగా.. 196 మంది ఏజెంట్లు ఉన్నారు. భైంసాలో జిన్నింగ్‌ మిల్లులు ఎక్కువగా ఉండటంతో అక్కడే అత్యధికంగా 159మంది ఏజెంట్లు , 195మంది వ్యాపారులున్నారు. కుబీర్‌లో, సారంగాపూర్‌లో కూడా ఏజంట్ల హవా నడుస్తోంది. మంచిర్యాల జిల్లాలో 121మంది ట్రేడర్లు ఉండగా.. లక్షెట్టిపేటలో 38మంది, చెన్నూరులో 35, మంచిర్యాలలో 21, బెల్లంపల్లిలో 20మంది ఉన్నా.. కమీషన్‌ ఎజంట్లు మాత్రం జిల్లా వ్యాప్తంగా.. అయిదుగురే ఉన్నారు. కుమురంభీం జిల్లాలో 235మంది ట్రేడర్లుండగా.. ఆసిఫాబాద్‌లో 100, కాగజ్‌నగర్‌లో 59, జైనూరులో 76మంది ఉన్నా.. న1లుగురే ఏజెంట్లున్నారు.
జిన్నింగ్‌ మిల్లుల నిర్వాహకులు, కమీషన్‌ ఏజెంట్లు కుమ్మక్కుతో రైతులకు ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచే పెట్టుబడులు పెట్టడం.. పండిన పంటను కమీషన్‌ వ్యాపారులకే విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. సీజన్‌ మొదలు నుంచి పంట చేతికొచ్చే సమయంలో ఎప్పుడూ అప్పు తీసుకున్నా సరే 20 నుంచి 25శాతం వడ్డీ చొప్పున ఇచ్చేలా ఖరారు చేసుకుంటారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు పెద్ద వడ్డీలకు కూడా అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. ఇక పంట చేతికొచ్చాక కమీషన్‌ ఏజంట్లకే పత్తి విక్రయించాలి. కమీషన్‌ ఏజంట్ల పేరుతోనే జిన్నింగ్‌ మిల్లులకు పత్తి విక్రయిస్తారు. జిన్నింగ్‌ వ్యాపారుల రైతు ఖాతాల్లో కాకుండా నేరుగా ఏజెంట్ల పేరుతోనే డబ్బులు జమ చేస్తారు. పత్తి పండించిన రైతులు మాత్రం తెరవెనుకే ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ప్రైవేటు ధర కంటే సీసీఐ ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. సీసీఐ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.5450 చొప్పున కొనుగోలు చేస్తున్నా.. ప్రైవేటు వ్యాపారులు మాత్రం కేవలం రూ.5300 మాత్రమే చెల్లిస్తున్నారు. అయినా.. ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పు తీసుకున్న పాపానికి వారికే పత్తి విక్రయించాల్సిన వస్తోంది. మార్కెట్‌కు తీసుకొచ్చిన పత్తిని మధ్యవర్తులు జిన్నింగ్‌ మిల్లులకు పంపినందుకు కాగితాలపైన నూటికి రూపాయి చొప్పున కమీషన్‌ తీసుకుంటున్నట్లు చూపుతున్నా అవసరాన్ని బట్టి రూ.3కి పైగా తీసుకుంటున్నట్లు రైతులు ఆరోపించారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరమే అవుతోంది. వాస్తవానికి మనీ లాండరింగ్‌ లైసెన్సు లేకుండా వడ్డీ వ్యాపారం చేయకూడదు. రైతులు తెచ్చిన పత్తి పంటను దళారుల ఖాతాల్లో కొనుగోళ్లకు సంబంధించిన భారీ ఎత్తున డబ్బులు జమ అవుతున్నాయి. ఈ లావాదేవీలను చూసి బ్యాంకులు ఏజెంట్ల పేర్లుమీద భారీగా రుణం మంజూరు చేస్తోంది. ఇదే రుణాన్ని రైతులకు పెట్టుబడులుగా పెట్టి భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. కమీషన్‌ ఏజెంట్ల ఖాతాలపైన ఆదాయపన్నుశాఖ దృష్టి సారిస్తే భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌ జిల్లాలో కొందరు కమీషన్‌ ఏజెంట్లు వారి సమస్య గురించి జిల్లా పాలనాధికారి దివ్య దృష్టికి తీసుకరావడంతో ఇలా వ్యాపారం చేయడం నేరమని.. వీరి గురించి విచారణ చేయాలని చెప్పడంతో ఎవరికివాళ్లు మొహం చాటెయ్యాల్సి వచ్చింది. నాలుగు జిల్లాల పాలనాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే పత్తి కొనుగోళ్లలో అనేక అక్రమాలు వెలుగులోకి రానున్నాయి.
ఆదిలాబాద్‌ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి ప్రైవేటు వ్యాపారులు 18.67లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా..అదే ఏడాదిలో సీసీఐ మాత్రం కేవలం 23,823 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. అప్పట్లో ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లోనే 13.64లక్షల క్వింటాళ్లు ప్రైవేటు వ్యాపారులు కొన్నదే. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ప్రైవేటు వ్యాపారులు 10.77లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా.. సీసీఐ మాత్రం 4513మంది రైతుల నుంచి 92,425 క్వింటాళ్లు కొనుగోలు చేశారు.  ప్రస్తుతం ప్రైవేటు ధర కంటే సీసీఐ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ రైతులు ఎందుకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారనేదానిపైన అధికారులు ఏమాత్రం ఆలోచించడంలేదు. మార్కెట్‌ యార్డుల్లో ప్రైవేటు వ్యాపారుల వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. సీసీఐ ధర ప్రకటించకుండా.. ప్రైవేటు ధరనే ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. వాస్తవానికి సీసీఐ ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నప్పుడు అదే ధరకు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. అలా అంగీకరిస్తేనే మార్కెట్‌యార్డులోకి రానివ్వాలని రైతులు ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు.
దళారీ దందా

Related Posts