యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
టమోటా ధరలు అంతంత మాత్రమే పలుకుతోంది. దీనికి తోడు దిగుబడి కూడా తగ్గుముఖం పడుతోంది. చేతికొచ్చిన పంటను మార్కెట్‌కు తరలిస్తే వ్యాపారుల స్వార్థంతో ధర నేలకు దిగజారుతోంది. 15రోజుల క్రితం మొదటిరకం కిలో టమోటాలు రూ.40లు పలికింది. ఫిబ్రవరి మొదటి నుంచీ రూ.10లకు పడిపోయింది. ఎండలు ముదురుతుండడం, సాగునీరు లేకపోవడం వంటి కారణాలతో చిత్తూరు జిల్లాలోని పడమటి పరిసర ప్రాంతాలలో టమోటా దిగుబడి ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీంతో ధరలు బాగుంటాయని ఆశపడిన రైతులకు వ్యాపారుల చేతివాటంతో కష్టం కూడా మిగలడం లేదు. మదనపల్లె మార్కెట్‌కు బుధవారం 175మెట్రిక్ టన్నుల టమోటా వచ్చాయి. పదిరోజుల క్రితం మొదటిరకం టమోటా ధరలు రూ.42ల నుంచి రూ.28ల వరకు పలికింది. రెండవ రకం రూ.25ల నుంచి రూ.16లకు పలికింది. శనివారం మదనపల్లె మార్కెట్‌కు 175టన్నుల టమోటా వచ్చాయి. మొదటి రకం రూ.11ల నుంచి రూ.8లకు పలికింది. గత 15రోజుల నుంచి ధరలు పతనం అవుతుండగా, పంటపొలం నుంచి మార్కెట్‌కు ట్రాన్స్‌ఫోర్ట్ ఖర్చులు కూడా మిగలడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో టమోటా దిగుబడి తగ్గుముఖం పట్టడంతో వ్యాపారులు ఒడీశా, చత్తీస్‌ఘడ్, కర్నాటక తదితర ప్రాంతాల నుంచి టమోటా మదనపల్లె మార్కెట్‌కు దిగుబడి చేసుకుంటున్నారు. దీంతో జిల్లా రైతులు పండించిన టమోటా ధర దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మదనపల్లె మార్కెట్‌కు రానీయకుండా చర్యలు తీసుకోవాల్సిన మార్కెట్ యార్డు అధికారులు ప్రేక్షకపాత్రలో మిన్నకుండి పోతుండటంతో ఈ వ్యవహరం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోంది.