యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఒక పక్క రాష్ట్రం అడుక్కుతింటుంది అంటారు. మరో పక్క ప్రత్యేక విమానాల్లో యాత్రలు సాగుతాయి. దీనికి తోడు కేంద్రం చిల్లుగవ్వ ఇవ్వడం లేదని నిత్య స్త్రోత్రం ఎలానూ ఉంటుంది. కనీసం ఆర్ధిక లోటు పూడ్చడం లేదని జీతాలకే డబ్బులు లేవని గోలగోల వినపడుతుంది. అలాంటి డబ్బున్న పేద ముఖ్యమంత్రి హోదాలో ఎపి ముఖ్యమంత్రి ధర్మ పోరాటం పేరిట పదికోట్ల రూపాయల ప్రజాధనం తో హస్తినలో ఒక పూట దీక్ష తలపెట్టారు. అదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తెరతీసింది.ఢిల్లీ లో తెలుగుదేశం అధినేత నిరసన దీక్షకు అంత ఖర్చు ఎందుకు అని తెలుసుకుంటే షాక్ అవ్వలిసిందే.ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చేతిలోని అన్ని అస్త్రాలను పూర్తిగా వాడేస్తున్నారు. ఓ వైపు కొత్త సంక్షేమ పథకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హోరెత్తిస్తూనే కేంద్రంపై పోరాటాన్ని తీవ్రంగా చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలిట బీజేపీ ఒక విలన్. ఆ విలన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న హీరోను తాను కావాలనేది చంద్రబాబు ప్లాన్. ఇప్పటికే జగన్.. బీజేపీతో కుమ్మక్కయారనే ప్రచారం పెద్ద ఎత్తున చేసినందున ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా తాను పెద్ద ఎత్తున ఉద్యమించడం ద్వారా బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రజలు తనవైపు ఉంటారనేది ఆయన వ్యూహంలా ఉంది. అందుకే ఆయన ఛలో ఢిల్లీ అంటున్నారు. ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్ష చేయాలని సంకల్పించారు. వాస్తవానికి చివరి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాక ఇప్పుడు దీక్ష చేసినా ఎటువంటి ప్రయోజనమూ ఉండదని చంద్రబాబు సైతం తెలుసు. అయితే, బీజేపీ ఏపీకి ద్రోహం చేసిన విషయాన్ని మరింత చర్చకు తేవాలనేది టీడీపీ వ్యూహం. బాహుబలి సినిమా బడ్జెట్ తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ల నుంచి రెండు ప్రత్యేక రైళ్ళు ఢిల్లీ కి బుక్ అయ్యాయి.వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కార్పొరేట్ తరహా ఏర్పాట్లు కోసం ఆ మాత్రం ఖర్చు మామూలే కదా. ఈ దీక్షకు ప్రతి ఉద్యోగ సంఘం 500 లమందికి తక్కువ కాకుండా తరలించాలని ఆయా శాఖల ఉన్నత అధికారులు మౌఖిక ఆదేశాలు ఇవ్వడం మరింత విశేషంఎన్నికల ముందు ఎంత ప్రచారం చేసుకుంటే అంత లాభం గా అధికార పార్టీ తలపోస్తుంది. బాబు దీక్షకు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నట్లే పోలవరం ప్రాజెక్ట్ సందర్శన పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని గోదాట్లో పోస్తుంది టిడిపి సర్కార్. ఆర్టీసీ బస్సుల్లో 13 జిల్లాల్లోని ప్రజలను పార్టీ క్యాడర్ సాయంతో తరలించి వారికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ప్రచార ఆర్భాటం వినూత్న రీతిలో సర్కార్ సాగిస్తుంది.యుపి ముఖ్యమంత్రి మాయావతి అధికారంలో ఉండగా ఇలాగే తమ పార్టీ ఎన్నికల గుర్తు ఏనుగు, కాన్సీరాం, తన విగ్రహాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దీనిపై ఇద్దరు న్యాయవాదులు ప్రజాధనం ఇలా ఖర్చు చేయడం ఏమిటంటూ సుప్రీం తలుపు తట్టారు. ఆ కేసు ఇప్పుడు మాయావతి మెడకు చుట్టుకుంది. ఆ విగ్రహాల కు పెట్టిన ఖర్చు చెల్లించి తీరాలని సుప్రీం కోర్ట్ బహుజన సమాజ్ పార్టీకి స్పష్టం చేసింది. ఇదే తీరులో పలు రాష్ట్రాల్లో తమ పార్టీ ప్రయోజనాలకోసం విచ్చలవిడిగా జనం సొమ్ము ధారపోస్తే ఎదో ఒక రోజు వడ్డీ తో సహా చెల్లించాలిసి వస్తుందని సుప్రీం తాజా ఆదేశాలు అన్ని పార్టీలకు చెంపపెట్టు లాంటిదే. ఇలాంటి పరిస్థితి చూసైనా రాజకీయ పార్టీల్లో కొంతైనా మార్పు వస్తుందో లేదో చూడాలి.చంద్రబాబు దీక్షకు జాతీయ స్థాయి నేతలు కూడా హాజరుకానున్నారు. వీరంతా చంద్రబాబుకు సంఘీభావం తెలపనున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ తరపున అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరవుతారా లేదా పార్టీ ప్రతినిధిని పంపిపస్తారా తేలాల్సి ఉంది. మొత్తానికి ఢిల్లీలో ఒక రోజు దీక్ష ఎన్నికల వేళ చంద్రబాబుకు బాగానే కలిసివచ్చే అవకాశం ఉంది. అయితే, అంతా బాగానే ఉన్నా… ఢిల్లీ దీక్షకు ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము ఖర్చు చేయడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే ధర్మపోరాట దీక్షలు, నవ నిర్మాణ దీక్షల పేరుతో డబ్బు దుబారా చేశారనే విమర్శలు ప్రభుత్వంపై ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటువంటివి ఇబ్బందిగా మారే అవకాశమూ ఉంది.