యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలోని దొంగ ఓట్ల వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు సుదీర్ఘంగా వివరించామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఆయన రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయాలనే గవర్నర్‌కు చెప్పడం జరిగింది. దాదాపుగా 59 లక్షల బోగస్ ఓట్లు ఎలా ఉన్నాయో.. వాటిని తొలగించాల్సిన అవసరం ఎంతగా ఉందో వివరించాం. ఇదికాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని రకరకాల సర్వేల పేరుతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్న విషయాన్ని గవర్నర్‌కు ఆధారాలతో సహా తెలియజేశాం. దాని ఆధారంగా టీడీపీకి ఓటు వేయని వారిని గుర్తించి.. వారి ఓట్లను దగ్గరుండి తొలగించే కార్యక్రమం ఎలా చేస్తున్నారో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. పోలీసు శాఖను ఎలా రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారో కూడా వివరించాం. ఒక వ్యక్తిని తానే పొడిచి.. మళ్లీ ఆ హత్యకు వ్యతిరేకంగా అతనే దీక్ష చేస్తే ఎలా ఉంటుందో.. చంద్రబాబు చేస్తున్న దీక్ష కూడా అలానే ఉంది. ప్రత్యేక హోదా రాకపోవడానికి ఏమైనా కారణం ఉందంటే అది చంద్రబాబు నాయుడు సీఎం కావడమే.. హోదాపై అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ఎటకారపు మాటలు.. ఈ అంశంలో ప్రతిపక్ష పోరాటాన్ని అవహేళన చేస్తూ చేసిన వ్యాఖ్యలు అందరికి గుర్తున్నాయి. ప్యాకేజీ తనవల్లే వచ్చిందని, ఈ ప్యాకేజీకి ధన్యవాదాలు తెలియజేస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానం, హోదాతో ఎక్కడైనా మేలు జరిగిందా అని చంద్రబాబు అన్న విషయాలు ప్రజలందరికి గుర్తున్నాయి. బీజేపీతో నాలుగేళ్ల సంసారంలో చంద్రబాబు.. ఆయన మంత్రులు ఏనాడు హోదాను అడగలేదు. ఇప్పుడు నల్లచొక్కాలు వేసుకుని ధీక్షలు చేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది’ అని వైఎస్ జగన్ విమర్శించారు.