యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతల్లో గుబులు మొదలైందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో కటీఫ్ అయిన తర్వాత మోదీ తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఆదివారం ఉదయం 11.15 గంటలకు గుంటూరు నగరానికి చేరుకోనున్న మోదీ.. ఏటుకూరు బైపాస్‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభించి వాటి శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సమీపంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా మోదీ సభకు జన సమీకరణ ఎలా చేయాలన్న దానిపై ఏపీ బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు చేదు అనుభవం ఎదురైన ఎదురైన సంగతి తెలిసిందే. పలాసలో మూడువేల మంది కోసం కుర్చీలు ఏర్పాటుచేయగా.. కనీసం మూడొందల మంది కూడా రాకపోవడంతో షా బస్సులో నుంచే ప్రసంగించి వెళ్లిపోయారు. అనంతరం ఆయన రాష్ట్ర నాయకులకు చివాట్లు పెట్టినట్లు తెలిసింది. దీంతో మోదీ సభకు భారీగా జనాన్ని సమీకరించాలని నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోదీ, కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటే రాష్ట్ర బీజేపీ నేతలు చేష్టలుడిగి చూస్తున్నారు. ఇప్పుడు మోదీ సభకు జనం రాకపోతే పార్టీ పరువు మొత్తం పోతుందని నేతలు భయపడుతున్నారట. దీంతో గుంటూరు జిల్లాలోని కొందరు వైసీపీ నేతల సహకారంతో జనాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం భారీ సంఖ్యలో శుభకార్యాలు ఉండటం కూడా జన సమీకరణకు అడ్డంకిగా మారింది. దీంతో మోదీ సభ ఎలా జరుగుతుందోనని నేతలకు నిద్ర పట్టడం లేదట.