యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
వెండితరపై అసమాన అభినయం ప్రదర్శించి కోట్లాది మనసులలో చెరగని ముద్ర వేసుకున్న తార శ్రీదేవి. నాలుగు సినిమా ఇండస్ట్రీలను రెండు దశాబ్దాల పాటు ఏలిన ఆ అందాల తార ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటించింది.. బాలయ్యతోనూ స్టెప్పులేసింది.. ఏఎన్నార్‌తో రొమాన్స్ చేసింది.. నాగార్జునతోనూ ఆడిపాడింది. కాని పెళ్లి కోసమని దుబాయ్‌కి వెళ్లి అక్కడి హోటల్‌లోని బాత్ టబ్‌లో మునిగి శ్రీదేవి హఠాన్మరణం చెందింది. ఆమె మరణం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఇప్పటికి ఆమె మరణవార్తని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. భౌతికంగా ఆమె ఈ లోకాన్ని వీడినా నటిగా శ్రీదేవి ముద్ర చిత్ర సీమలో సుస్థిరం. ఫిబ్రవరి 24, 2018న శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజులలో శ్రీదేవి మరణించి ఏడాది కావొస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆమె ప్రథమ వర్ధంతిని శ్రీదేవికి నచ్చిన స్థలంలోనే జరపాలని నిర్ణయించుకున్నారట. శ్రీదేవికి చెన్నై నగరం అన్నా, అక్కడ ఉన్న తన ఇల్లు అన్నా ఎక్కువ ప్రేమ అట. అందువలన అక్కడే ఆమె ప్రథమ వర్ధంతిని జరపాలని వాళ్లు నిర్ణయించుకున్నారని సమాచారం. ఆ రోజు నిర్వహించే ప్రత్యేక పూజలో శ్రీదేవి కుటుంబ సభ్యులతో పాటు, పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొననున్నారని చెబుతున్నారు. శ్రీదేవి నటించిన చివరి చిత్రం జీరో కాగా, ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.