YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చేపకు మంచిరోజులు

చేపకు మంచిరోజులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కోస్తాతీరంలోని సారవంతమైన నేలలో సాగవుతున్న ఆక్వాకు మరింతగా మేలు జరగనుంది. జిల్లాలో  అధికారికంగా 58,754.33 హెక్టార్ల విస్తీర్ణంతో పాటు అనధికారికంగా మరో 20 వేల హెక్టార్లలో ఆక్వాసాగు కొనసాగుతోంది. సుస్థిరమైన, పరిశుభ్ర కాలుష్య రహిత వాతావరణంలో జరుగుతున్న సాగు రాష్ట్రంలో జిల్లాను ప్రథమస్థానంలో నిలుపుతోంది. ఆక్వాసాగును క్రమబద్ధీకరించేందుకు ఇప్పటికే జిల్లాను 238 రెవెన్యూ గ్రామాలుగా విభజించి జోన్లుగా గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం మత్స్యశాఖను ఏర్పాటు చేసి బడ్జెట్‌ కేటాయిస్తే జిల్లాలోని నదుల్లో వేసే పిల్లలు, కృత్రిమంగా సాగు చేసే రైతులకు, సముద్రంలో వేటాడే మత్స్యకారులకు, సముద్రతీరంలోని మత్స్యకారులకు ప్రయోజనాలను ఉపయోగించుకుని మరింత దిగుబడులు సాధించే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో అనేక ప్రయోగశాలలు, శీతల గిడ్డంగులు, చేపల నుంచి అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మచిలీపట్నంలో పోర్టు పనులు కూడా జరుగుతుండటంతో ఇక్కడి నుంచే ఎగుమతులు చేసే అవకాశం ఉంటుంది.
రాష్ట్రంలోని నదీ తీరం, సరస్సుల వద్ద, కాలువల ఆధారంగా కృత్రిమ చేపల, రొయ్యల సాగు జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని వనరుల నుంచి రూ.20,600 కోట్ల విలువైన చేపలు, రొయ్యలు ఎగుమతులు అవుతున్నాయి. 2017-18లో ప్రపంచవ్యాప్తంగా 1672 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు జరగ్గా.. భారత్‌లో 95.80 లక్షల టన్నులు వచ్చింది. ఇందులో 19.78 లక్షల టన్నుల ఉత్పత్తితో రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉండగా 10.96 లక్షల టన్నుల ఉత్పత్తితో జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది.
ఇప్పటి వరకు మత్స్యశాఖ వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. దీంతో మత్స్యశాఖ పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం అనివార్యమయ్యేది. వ్యవసాయానికే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆక్వాను వ్యవసాయ అనుబంధ రంగంగా గుర్తించడంతో కేంద్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఏర్పాటుకు ముందుకొచ్చింది. కేంద్రంలో మత్స్యశాఖ ఏర్పాటుతో పరిశోధనలకు కొత్త సంస్థలు నెలకొల్పే అవకాశం ఉంటుంది. అధికారులు ఆయా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తక్షణ నిర్ణయాలు తీసుకోవడంతో సాగుదార్లకు, ఎగుమతులకు ఊతంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలకు అదనంగా కేంద్ర పథకాలు, రాయితీలు ఉంటాయి.ఆధునిక సాంకేతికతను రైతు వద్దకు తీసుకువచ్చే అవకాశాలు అధికమవుతాయి. ప్రపంచంలోని అనేక దేశాలకు మన ఎగుమతులు చేసే అవకాశం కలుగుతుంది. ప్రత్యామ్నాయ జాతుల పెంపకం ద్వారా ఉత్పత్తి పెంచడానికి అవకాశం కలుగుతుంది. మత్స్యకారులకు ఆధునిక, సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ ఇచ్చే అవకాశాలు మెరుగుపడతాయి. మార్కెటింగ్‌లో చేపల, రొయ్యల ఉత్పత్తి వినియోగానికి  దేశీయ మార్కెట్‌ను, రిటైల్‌ అవుట్‌లెట్స్‌, మొబైల్‌ అవుట్‌లెట్స్‌ అభివృద్ధి చేసే అవకాశాలు ఉంటాయి. మత్స్యశాఖకు నిధులు కేటాయించడం వల్ల వాటి వినియోగంతో సముద్ర, నదుల్లో ఉత్పత్తులను మరింత పెంచే వీలు కలుగుతుంది. సొంతంగా రొయ్య విత్తనాలపై పరిశోధన చేసి.. తక్కువ ధరకు పిల్ల సరఫరా చేసే అవకాశం ఉంటుంది. వ్యవసాయ పంటల తరహాలోనే ఆక్వాకు కూడా బీమా, పన్ను రాయితీలు కల్పించే అవకాశముంటుంది.వివిధ పనులకు తక్షణ అనుమతులు వచ్చే అవకాశం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో సముద్ర తీరాన్ని ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తే రాష్ట్రంలో సముద్రవేట సాగించే మత్స్యకారులు అద్భుతాలు సాధించే అవకాశం ఉంటుంది. అధునాతన బోట్లు, వలలు, శాటిలైట్‌ ఆధారిత సమాచారం వల్ల వేట సులువు అవుతుంది. సముద్ర తీరాన్ని, సముద్రాన్ని ఉపయోగించుకుని పంజర సాగుతో దిగుబడులను పెంచవచ్చు. ఇప్పటికే ఉప్పునీటి సాగు ఆక్వా విస్తీర్ణం ఇప్పటికే రాష్ట్రంలో 12,942 వేల హెక్టార్లకు చేరుకుంది. సముద్రం, సముద్రతీరం కూడా ఇక ఉత్పత్తుల సాధనలో అగ్రగామిగా ఉండనుంది.

Related Posts