Highlights
- ఆశ్చర్యపోయానన్న నీరవ్ తరపు న్యాయవాది
- గీతాంజలి జెమ్స్ మూసివేత
- రోడ్డునపడ్డ కార్మికులు
పంజాబ్ నేషనల్ బ్యాంకు భారీ కుంభకోణంలో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోడీకి చెందిన వ్యాపార సంస్థల ఆర్థిక సలహాదారు విపుల్ అంబానీని మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. అంబానీతో పాటు, మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ అరెస్టుల విషయం తెలుసుకుని తాను ఆశ్చర్యపోయానని నీరవ్ తరపు న్యాయవాది విజరు అగర్వాల్ వ్యాఖ్యానించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆఫీసర్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రూ.5,600 కోట్ల విలువ చేసే నీరవ్‌కు సంబంధించిన వజ్రాలు, బంగారం, ఢిల్లీ, ముంబయి, సూరత్, జైపూర్ ప్రాంతాలకు చెందిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
గీతాంజలి జెమ్స్ మూసివేతా రోడ్డునపడ్డ కార్మికులు
నీరవ్ మోడీకి చెందిన గీతాంజలి జెమ్స్ ఫ్యాక్టరీలను మూసివేయడంతో వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు.
పిఎన్‌బి స్కాం తర్వాత చోటుచేసుకున్న వరుస సంఘటనల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న గీతాంజలి జెమ్స్ ఫ్యాక్టరీలను మూసివేశారు. ఇందులో భాగంగా తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న గీతాంజలి జెమ్స్ ఫ్యాక్టరీని మూసివేయడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఫ్యాక్టరీ బాధ్యతల్ని నిర్వహిస్తున్న వ్యక్తులు పరారీలో ఉన్నారు.