యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా ఎటాకింగ్ మోడ్ లోకి వెళ్లిపోయారు. గత ఆరు నెలలుగా ఆయనపై వరుసగా విమర్శలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్నప్పటికీ ఆయన ఎక్కడా దీనిపై పెదవి విప్పలేదు. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాతో సయితం మోదీ సర్కార్ పై చంద్రబాబు నిప్పులు చెరిగినా మోదీ మౌనమే దాల్చారు. కార్యకర్తలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లలో మాత్రం చంద్రబాబుపై పరోక్ష విమర్శలను మాత్రమే మోదీ చేశారు తప్ప ఆయన పేరును నేరుగా ప్రస్తావించలేదు. గుంటూరు సభలో మాత్రం మోదీ ఫుల్లు ఎటాకింగ్ మోడ్ లోకి వెళ్లిపోయారు. వచ్చింది ఆంధ్రప్రదేశ్ కావడంతో తాను ఏపీకి ఏం చేశానన్నది చెబుతూనే చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న చంద్రబాబును కుమార చక్ర బంధం వేశారు. ఆయన ఎక్కువగా లోకేష్ పైనే టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. తాను ఇప్పటి వరకూ ఏపీకి మూడు లక్షల కోట్లు ఇచ్చానని, అయితే వేటికీ లెక్కలు చెప్పే పరిస్థితి చంద్రబాబుకు లేదని తేల్చి చెప్పారు.తాను జరిపిన పర్యటన ప్రభుత్వ కార్యక్రమమైనా ఇక్కడ పార్టీ ఖర్చులు భరించిందని, చంద్రబాబు మాత్రం ధర్మపోరాట దీక్షలతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఢిల్లీకి వెళ్లి ఫొటోలు దిగే ఖర్చు కూడా ప్రజల జేబుల్లోనుంచి వెళ్లేదేనని మోదీ తీవ్రంగా దుయ్యబట్టారు. కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసమే ఏపీ అభివృద్ధిని పణంగా పెట్టారన్నారు. తాము ఇస్తామన్న ప్యాకేజీకి తొలుత అంగీకరించి, శాసనసభలో తీర్మానం చేసి తర్వాత యూటర్న్ తీసుకుందీ లోకేష్ కోసమేనని ఆయన చెప్పారు. ప్రధాని పెదవుల నుంచి నారా లోకేష్ మాట అనేక సార్లు రావడం విశేషం.ఏపీలో కమలం పార్టీకి ఎటూ పెద్దగా ఓటు బ్యాంకు లేదు. వచ్చే ఎన్నికల్లో కనీస స్థానాలను కూడా గెలుచుకుంటుందన్న నమ్మకం లేదు. అయితే జాతీయ స్థాయిలో తనకు వ్యతిరేకంగా కూటమి కడుతున్న చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే మోదీ వచ్చారన్నది సుస్పష్టం. మోదీ చేసిన అనేక విమర్శలకు చంద్రబాబు ఖచ్చితమైన జవాబు చెప్పినా.. కుమారుడు లోకేష్ విషయంలో చేసిన విమర్శలకు చంద్రబాబు స్పందన అంతగా లేదు. మోదీకి కుటుంబ బాంధవ్యాలు తెలియదని, లోకేష్ తండ్రిగా తనను మోదీ పేర్కొనడం గర్వంగా ఉందని మాత్రమే చెప్పి చంద్రబాబు ఆ విషయాన్ని సరిపెట్టారు. మొత్తం మీద మోదీ మాత్రం ఎటాకింగ్ మోడ్ లోకి వెళ్లిపోయారు. భవిష్యత్తులో ఏపీలో మోదీ సభలను మరిన్ని ఏర్పాటు చేసేందుకు కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది.