యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కృష్ణాజిల్లాలోని గుడివాడ పేరెత్తగానే అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన నందమూరి తారక రామారావు. ఆయన జన్మించిన నిమ్మకూరు గుడివాడకు దగ్గరలో ఉండటం, అక్కడినుంచే ఆయన ఎన్నికల్లో పోటీచేసి అసెంబ్లీలో అడుగుపెట్టడం అనే చారిత్రక ఘట్టాలకు ఆ ప్రాంతం నిదర్శనం! అలాంటి గుడివాడలో తెలుగుదేశంపార్టీ క్రమేపీ తన ప్రాభవాన్ని కోల్పోయింది. గతంలో టీడీపీ నుంచి పోటీచేసి గెలిచిన కొడాలి నాని.. ఆ తరవాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. జగన్‌కు ముఖ్య అనుచరుడిగా.. ఆ పార్టీలో కీలకంగా మారారు. పార్టీ మారేముందు చంద్రబాబుపై ఆయన ఘాటు విమర్శలే చేశారు. నాని తనతో పాటు స్థానికంగా ఉన్న క్యాడర్‌లో ఎక్కువమందినే తనవెంట వైసీపీలోకి తీసుకెళ్లారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై కొడాలి నాని గెలిచారు. రావినే ఇప్పుడు గుడివాడ టీడీపీ ఇన్‌ఛార్జ్. అయితే రానున్న ఎన్నికల్లో నానిని ఓడించే బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తోంది. వెంకటేశ్వరరావునే మళ్లీ పోటీకి పెట్టడమా? లేక మరో గట్టి అభ్యర్థిని బరిలో దింపడమా? అని తెలుగుదేశం అధిష్టానం ఆలోచిస్తోంది. ఒకవేళ రావికి టిక్కెట్ ఇవ్వని పక్షంలో ఆయనకు మరో పదవి ఇవ్వాలని భావిస్తున్నారు.ఈ క్రమంలోనే టీడీపీ యువనేత దేవినేని అవినాష్ పేరును కొందరు తెరపైకి తెచ్చారట. దేవినేని నెహ్రూ తనయుడిగానే కాక.. సొంత ఇమేజ్‌ను అవినాష్సం పాదించుకున్నారట. అందరితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయట. అవినాష్‌కు మంచి ఆర్థిక, అంగబలం ఉందనీ.. ముందే ఆయనకు టికెట్ ఖరారుచేస్తే నియోజకవర్గంపై దృష్టి సారిస్తారనీ, ఎన్నికల్లో తప్పక గెలుస్తారనీ టీడీపీ ముఖ్యులు కొందరు అంటున్నారు. బుద్దా వెంకన్న సహా పలువురు నగర పార్టీ పెద్దలు సైతం ఇదే విషయాన్ని చంద్రబాబుతో చెప్పారట. గ్రామాలవారీగా వెళ్లి, నేతలు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తే ఫలితం పక్కా.. అని నమ్మకంగా అన్నారట. మరి అవినాష్‌కు టికెట్ ఇస్తే స్థానిక నేతలు సహకరిస్తారా? క్యాడర్ ఏమనుకుంటోంది? అనే అంశాలపై చంద్రబాబు ఆరాతీస్తున్నారట!దేవినేని నెహ్రూ వారసుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన అవినాష్ కొంతకాలంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. విజయవాడలో పార్టీ తరఫున కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏపీ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షని నిరసిస్తూ యువకులతో ఆందోళనలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ఈ మధ్యే ఆయనను రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. ఫిబ్రవరి 6వ గ్రాండ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలనీ, వారిని ప్రోత్సహిద్దామనీ పదేపదే ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న సంగతి తెలిసిందే! ఈ తరుణంలో గుడివాడ టికెట్ అవినాష్‌కు ఇస్తే బాగుంటుందని ఆయన అనుచరులు అభిలషిస్తున్నారు. అవినాష్ గనుక గుడివాడ బరిలో దిగితే ఎన్నికలపోరు ఆసక్తికరంగా మారుతుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న దేవినేని నెహ్రూ అనుచరులు, విజయవాడలోని అవినాష్ అనుచరవర్గం మొత్తం గుడివాడలోనే మకాంవేసి ప్రచారం చేస్తారని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి అవినాష్‌కు పార్టీ టికెట్ ఇస్తుందో.. లేదో!