యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దక్షిణ కైలాసంగా..సద్యోముక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈ నెల 27వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 13 రోజుల పాటు అంగరంగ వైభవోపేతంగా సాగే ఈ ఉత్సవాల ఏర్పాట్లకు ఆలయాధి కారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. 27న భక్తకన్నప్ప ధ్వజారోహణం, 28న స్వామి వారి ధ్వజారోహణం, మార్చి 1న భూత, శుక వాహనసేవలు, 2న రావణ-మయూర వాహనాలు, 3న శేష-యాళీ వాహన సేవలు, 4న మహా శివరాత్రి, నంది సేవ, అర్ధరాత్రి లింగోద్భవం, 5న రథోత్సవం, 6న కల్యాణోత్సవం, 7న సభాపతి కల్యాణం, 8న స్వామీ అమ్మవార్ల గిరిప్రదక్షిణ, 9న ధ్వజావరోహణం, 10న పల్లకీసేవ, 11న ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. 12న అభిషేక శాంతి పూజలతో ఉత్సవాలకు తెరదించుతారు. శివరాత్రి ఉత్సవాలకు ఇంకెంతో సమయం లేకపోవడంతో ఆలయంలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. శిల్పకారులు వాహనాలకు రంగులు అద్దుతున్నారు. రంగవళ్లులు వేస్తున్నారు. విద్యుద్ధీ పాలకంరణ పనులు సైతం వేగం పుంజుకున్నాయి. ఈ సారి ఉత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు తరలి రానున్న దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, విశ్రాంతి ప్రదేశాలను ఈవో రామస్వామి పర్యవేక్షణలో ఏర్పాట్లు రూపు దిద్దుకుంటున్నాయి.