యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్షకు రాహుల్‌గాంధీ, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా మద్దతు ప్రకటించారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించి ఏపీ పోరాటానికి అండగా ఉంటామని స్పష్టం ఇచ్చారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్లినా అబద్ధాలు చెప్పడం ప్రధాని మోదీకి అలవాటుగా మారిందన్నారు. ఏపీకి వెళ్లిన మోదీ ప్రత్యేక హోదాపై కూడా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రధానిగా ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత మోదీకి లేదా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందన్నారు. దేశానికి కాపలాదారుగా ఉంటానన్న మోదీ.. దొంగలా మారారని విమర్శించారు. ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ధర్మం తప్పినప్పుడే ప్రజల్లో ఆందోళన మొదలవుతుందన్నారు. కేంద్ర ధర్మం తప్పినందువల్లే ఏపీ ప్రజలు ఢిల్లీకి వచ్చి పోరాటం చేస్తున్నారు. ప్రాంతాలు, కులాలు, మతాలను విభజించి పాలించాలని చూస్తున్నారని, దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం పోవాలన్నారు. వ్యక్తిగత దూషణల స్థాయికి ప్రధాని దిగజారడం విచారకరమని ఫరూఖ్ అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మద్దతు పలికారు. మరింత ఆలస్యం చేయకుండా ఆ హామీని నెరవేర్చాలని మన్మోహన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహాన్ ఈ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంట్‌లో అన్ని పార్టీలు ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపాయని మన్మోహన్ అన్నారు. సీఎం బాబుకు తాను సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదా ప్రామిస్‌ను వెంటనే అమలు చేయాలన్నారు. ఏపీ రాష్ట్ర ప్రజల వెంటే తాము ఉన్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు పార్లమెంట్ అంగీకరించిందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ తెలిపారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్షకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు తమ పార్టీ ప్రతినిధి డెరెక్ ఓబ్రీన్ ద్వారా దీదీ సంఫీుభావ సమాచారాన్ని బాబుకు పంపారని తృణమూల్ నాయకుడు ఒకరు తెలిపారు. ప్రధానిమోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడంలో ప్రతిపక్షం ఐక్యంగా ఉంటుందని, ఈ విషయంలో తాము ముందుంటామని ఈ సందర్భంగా దీదీ స్పష్టం చేశారని తెలిపారు. కేంద్రం తీరును నిరసిస్తూ రాజ్యాంగ పరిరక్షణ పేరుతో కోల్‌కతాలో మమతా బెనర్జీ దీక్ష చేపట్టగా చంద్రబాబు కోల్‌కతా వెళ్లి మరీ తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే