YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మోడీ టూర్ వైసీపీ, జనసేనకు లైఫ్

మోడీ టూర్ వైసీపీ, జనసేనకు లైఫ్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

గురివింద గింజ తన నలుపును గుర్తించలేదంటారు. రాజకీయ నాయకులూ అంతే. ప్రత్యర్థి పాపాలు, లోపాలే తప్ప స్వీయతప్పిదాలు కళ్లకే కనిపించవు. అచ్చంగా అలాగే ప్రవర్తించారు నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడులు. తప్పంతా ఎదుటివారిదే అన్నట్లుగా దుమ్మెత్తి పోసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, అవినీతి వంటి అంశాలను ప్రస్తావిస్తే ఫర్వాలేదు. పరస్పర వ్యక్తిగత విమర్శలకు దిగి రోడ్డెక్కారు. దీంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాధినేతల బండారాన్ని మనసారా విని ఆనందించారు ప్రజలు. ప్రత్యేకించి విపక్షాలకు ఈ తంతు బాగా నచ్చింది. తాము విమర్శలు చేయాల్సిన అవసరం లేకుండానే పరస్పరం ఆరోపణలు, విమర్శలతో ఇద్దరూ రాష్ట్రానికి ద్రోహం చేశారన్న విషయం స్పష్టమైపోయిందంటున్నారు. వైసీపీ, జనసేనలకు ఉత్సాహాన్నిచ్చింది ప్రధాని మోడీ పర్యటన. నెలరోజులకు పైగా వాయిదా పడుతూ వచ్చిన సభ ఎట్టకేలకు అయిందనిపించారు. రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న అంశాలపై పెద్దగా స్పందించని ప్రధాని ముఖ్యమంత్రిని మాత్రం టార్గెట్ చేశారు. ఇరుకున పెట్టారు.ఎన్టీరామారావు ను వెన్నుపోటు పొడిచి గద్దె దించడం మొదలు కొడుకు లోకేశ్ కు ప్రభుత్వంలో పెద్దపీట వేయడం వరకూ ప్రధాని ప్రస్తావించారు. ఇవేమీ కొత్త విషయాలు కాదు. కానీ ప్రధాని నోటి వెంట సూటిగా, నేరుగా దూసుకురావడమే విశేషం. చంద్రబాబు నాయుడి సీనియారిటీని ఎద్దేవా చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించడమూ ప్రత్యేక ఆకర్షణగానే నిలిచింది. చీటికీమాటికీ సందర్భరహితంగా తాను ప్రధాని కంటే సీనియర్ నంటూ చంద్రబాబు చెబుతూ ఉండటాన్ని మోడీ దృష్టిలో పెట్టుకున్నారు. వెన్నుపోటు పొడవడం, పార్టీలు మార్చడం, కొత్త పొత్తులు పెట్టుకోవడం, కొడుకుకు పట్టం గట్టడం వంటి అంశాలలో ఆయన సీనియరే అంటూ ఎత్తి పొడిచారు. అయితే ఈ విషయంలో ఎవరూ తక్కువ కాదు. 2000 వ సంవత్సరంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి సొంత పార్టీకి చెందిన వ్యక్తే అయినప్పటికీ వ్యతిరేకంగా గ్రూపు కడుతున్నారనే ఉద్దేశంతోనే మోడీని ఢిల్లీకి పిలిపించి జాతీయ బాధ్యతలు అప్పగించారు. తెర వెనక రాజకీయాలు చేయడంలో తానేమీ తక్కువ కాదు. అలాగే గురువు అద్వానీకి ఎటువంటి కీలక బాధ్యతలు ఇవ్వకుండా దూరంగా పెట్టడంలో విజయం సాధించారు. రాష్ట్రపతి వంటి పదవులు కట్టబెట్టే అవకాశం ఉన్నప్పటికీ పార్టీలో మళ్లీ ఆయన చుట్టూ రాజకీయం కేంద్రీకృతం అవుతుందనే ఉద్దేశంతో అద్వానీని నామమాత్రం చేసేశారు. ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు కూడా ఎత్తి చూపారు.అద్వానీ విషయంలో మోడీ తప్పిదాలను చంద్రబాబు బాగానే ఎత్తి చూపారు. కానీ కొడుకు విషయం వచ్చేసరికి తడబడ్డారు. ’తనకు కుమారుడు ఉన్నాడు. అనుబంధం ఉంది. కుటుంబంతో గడపడమే సంతోష దాయకం ‘అంటూ సందర్భరహితంగా మాట్టాడారు. విమర్శలను తోసి పుచ్చలేకపోయారు. తన కొడుకు ఏ అర్హతలతో మంత్రి పదవిని, పార్టీలో ఉన్నతస్థానాన్ని పొందగలిగారన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేక చేతులెత్తేశారు. పార్టీలో దీర్ఘకాలంగా ఉన్నవారికి సైతం పదవులు లభించడం లేదు. అంతేకాదు మిగిలిన సీనియర్ నేతల పిల్లలకూ ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఇచ్చేందుకు వెనకాడుతున్నారు. ఇదే బలహీనతను మోడీ ఎత్తి చూపారు. లోకేశ్ కోసం చంద్రబాబు నాయుడు అన్నిరకాలుగా దిగజారుతున్నారనే అర్థం వచ్చే విధంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిని తిప్పికొట్టేందుకు పార్టీ వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. సమర్థత కారణంగా కాకుండా ప్రత్యామ్నాయం లేకపోవడంతో బలవంతంగానే లోకేశ్ ను రుద్దుతున్నారనే భావన క్యాడర్ లో కూడా ఉంది. అందువల్లనే లోకేశ్ పై విమర్శలు వచ్చిన సందర్భంలో బలంగా తిప్పికొట్టలేకపోతున్నారు. చంద్రబాబునాయుడి విషయానికొచ్చే సరికి ద్వితీయ శ్రేణి నాయకులు బాగానే స్పందిస్తున్నారు. లోకేశ్ ను పార్టీ నాయకులు ఇంకా సొంతం చేసుకోలేకపోతున్నారు.మోడీ ఎందుకొచ్చారు? అంటూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. మొత్తం ఆంధ్రప్రజానీకం అందరిలోనూ అదే ప్రశ్న. చంద్రబాబు నాయుడి మీద విమర్శలు చేయడానికే అయితే ఇంతదూరం పనిగట్టుకుని రావాల్సిన అవసరం లేదు. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ వాటన్నిటినీ లెక్కచేయకుండా పెట్టిన బహిరంగసభ నిరాశాపూరితంగా సాగింది. కనీసం బీజేపీ నేతలను కూడా మెప్పించలేకపోయింది. ’తమ అధినాయకుడు వస్తాడు . రాష్ట్రానికి వరాల వాన కురిపిస్తారు. బీజేపీ పరిస్థితి మెరుగుపడుతుంది.‘ అంటూ ఇంతకాలం నమ్మబలుకుతూ వచ్చారు బీజేపీ నాయకులు. తాము ప్రజల్లోకి వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధాని ఆమేరకు భరోసాకల్పించేలా చేస్తారని ఆశించారు. కానీ వట్టి చేతులతో వారి మానాన వారిని వదిలేశారు. ఇక ఏపీలో కమలం పార్టీని దేవుడు కూడా కాపాడలేడనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. బీజేపీ నాయకుల జోరు, జోష్ కూడా తగ్గిపోతుంది. టీడీపీ విమర్శలను తిప్పికొట్టడంలో ఇకపై తప్పించుకు తిరిగే ధోరణి కనిపించవచ్చు.

Related Posts