యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన రన్వే మంగళవారం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ప్రభు ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదన్ రావు పాల్గొన్నారు. 2017 ఫిబ్రవరి 12న ముఖ్యమంత్రి చంద్రబాబు, నాటి కేంద్రమంత్రిగా ఉన్న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కలిసి రన్వే పనులను ప్రారంభించారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంగా మారిన నేపథ్యంలో భారీ విమాన సర్వీసులు రాకపోకలు సాగించేందుకు పొడవైన రన్వే అవసరం. దానికి తగ్గట్టుగా రన్వేను రూపొందించారు. గత డిసెంబర్ నుంచి అంతర్జాతీయ సర్వీసులు గన్నవరం నుంచి ఆరంభమయ్యాయి. కొత్త రన్వే అందుబాటులోనికి రావడంతో ప్రస్తుతం ఎయిర్ బస్ ఎ380, ఎ340, బోయింగ్ 777, 747 వంటి పెద్ద విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలు కలిగింది. ఒకేసారి 16 విమానాలు నిలిపే సామర్థ్యంతో పార్కింగ్ ప్రాంతం విస్తరణ చేశారు. రూ.98.59కోట్లతో విమానాశ్రయం రన్ వే, పార్కింగ్ వే పనులు చేపట్టారు.