యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూసిన విషయం తెలిసిందే. బాపినీడు నివాసంలో సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచిన ఆయన మృతదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన్ని గుర్తుచేసుకుని తీవ్ర ఆవేదన చెందారు. బాపినీడుకు నివాళి అర్పించిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ‘ఇవాళ నాకెంతో దుర్దినం. విజయ బాపినీడు గారు మరణించారనే వార్తను నమ్మలేకపోతున్నాను. ఆయన నన్ను ఓ కొడుకులా, తమ్ముడిలా చూసుకునే వారు. ఆయనతో నా అనుబంధం కేవలం ఓ దర్శకుడు, నిర్మాతలా ఉండేది కాదు. నా మనసుకు అతి దగ్గరైన వ్యక్తి బాపినీడు
బాపినీడుతో తన పరిచయం ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ నుంచి మొదలైందని చిరంజీవి చెప్పారు. ‘ఆయన నాతో ఆరు సినిమాలు చేశారు. ఇతర హీరోలతో కూడా మీరు సినిమాలు చేయొచ్చు కదా అని ఆయనతో నేను అంటూ ఉండేవాడిని. మీతో సినిమాలు తీయడం ప్రారంభించిన తర్వాత ఆ కంఫర్ట్ గానీ, సెంటిమెంట్ గానీ మరొకరితో నాకు కుదురడం లేదు అనేవారు. వేరే వారితో చేయలేకపోతున్నాను అని చెబుతూ చాలా కాలం నా పట్ల ఆ అభిమానాన్ని, ప్రేమను చూపించిన గొప్ప వ్యక్తి ఆయన’ అని బాపినీడుతో తన అనుబంధాన్ని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. ‘నేను హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన కొత్తలో ఎక్కడ ఉండాలి అని అనుకుంటున్న సమయంలో.. హైదరాబాద్‌లో నా గెస్ట్ హౌస్ ఉంది, మీరు అందులో ఉండొచ్చు అని బాపినీడు భరోసా ఇచ్చారు. పై ఫ్లోర్లలో ఉండే ఆయన కుటుంబ సభ్యులను కిందకు పంపించి, పై రెండు ఫోర్లు నాకు ఇచ్చారు. చాలా కాలం అక్కడే ఉన్నాను. ఎప్పుడూ నాపై తమ్ముడిలా, కొడుకులా వాత్సల్యం చూపించేవారు. ఆయనతో ఎన్నో స్వీట్ మెమొరీస్’ అని చిరంజీవి వెల్లడించారు. ‘ఒకరోజు ‘మగమహారాజు’ 100 రోజుల ఫంక్షన్ జరుగుతుంటే.. ఓ ఏనుగును నాకు బహుమతిగా ఇచ్చారు. ఇదేమిటండీ దీనిని నేను ఏం చేసుకోనూ! అంటే.. మీతో నాకు ఉన్న అనుబంధానికి, మీరు నా పట్ల చూపించే ప్రేమకు తగ్గట్టుగా ఏ బహుమతి ఇస్తే బాగుంటుందని ఆలోచించాను. ఏనుగును ఇస్తే దానికి మ్యాచ్ అవుతుందనిపించింది. అందుకే దీనిని ఇచ్చాను అంటూ నా మీద ప్రేమను అలా చూపిన గొప్ప మనసున్న మనిషి ఆయన’ అని చిరంజీవి వెల్లడించారు.‘గ్యాంగ్ లీడర్’ ఫంక్షన్‌ను ఒకే రోజు నాలుగు పట్టణాల్లో గ్రాండ్‌గా జరిపించిన అరుదైన రికార్డ్ తమ ఇద్దరి కాంబినేషన్‌లో ఉందని చిరంజీవి చెప్పారు. ‘ఆయన ఏం చేసినా చాలా వినూత్నంగా, కొత్తగా ఉండేది. ముఖ్యంగా నా అభిమానులకు ఆయన అంటే చాలా ఇష్టం. వారికి ఎంతో దగ్గరగా ఉండేవారు. తన అభిమానుల కోసం ‘చిరంజీవి’ అనే మ్యాగజైన్‌ను బాపినీడు పబ్లిషర్‌గా, ఎడిటర్‌గా తీసుకొచ్చారని మెగాస్టార్ వెల్లడించారు. అందులో తనకు సంబంధించిన ఫోటోలను, వార్తలను ప్రత్యేకంగా పొందుపరిచి అందించేవారన్నారు. ‘బాపినీడు గారి మ్యాగజైన్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎదురుచూసేలా చక్కగా ప్రింట్ చేసేవారు. ఆ రకంగా కూడా ఆయన నా మీద ప్రేమ చూపించారు. అలాంటి వ్యక్తిని ఇవాళ కోల్పోవడం చాలా బాధకరం. చాలా దురదృష్టంగా భావిస్తున్నాను’ అని చిరంజీవి తెలిపారు. బాపినీడు గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నని, వారి కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, నా సానుభూతిని తెలియచేస్తున్నానని అన్నారు