యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సీబీఐ అడిషనల్ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు మళ్లీ షాకిచ్చింది. బీహార్ వసతి గృహాల్లో వేధింపుల కేసులో అక్షింతలు వేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు రూ.లక్ష జరిమానాతో పాటూ.. కోర్టు బెంచ్ లేచే వరకు గదిలో ఓ మూల కూర్చోవలసిందిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదేశించారు. నాగేశ్వరరావు లీగల్ అడ్వైజర్‌కు కూడా జరిమానాతో పాటూ అదే శిక్ష విధించింది. బీహార్‌లోని ముజఫరాబాద్ వసతి గృహాల్లో వేధింపుల కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో దర్యాప్తు అధికారి శర్మను కోర్టు అనుమతి లేకుండా మార్చొద్దని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అయితే సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావు కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఆ అధికారిని బదిలీ చేశారు. దీంతో కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించారంటూ ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసు జారీ చేశారు. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నాగేశ్వరరావు సోమవారం క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. మంగళవారం ఆయనే స్వయంగా విచారణకు హాజరుకాగా.. నాగేశ్వరరావు తరపున అటార్నీ జనరల్ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రధాని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అధికారి తప్పు చేస్తే ప్రభుత్వం ధనంతో ఆయన తరఫున ఎలా వాదిస్తారని ప్రశ్నించారు. క్షమాపణలు చెప్పడం వింతగా, హాస్యాస్పదంగా ఉంది.. క్షమాపణలు చెబితే సరిపోతుందా అని జస్టిస్ గొగోయ్ అన్నారు. ఆయన క్షమాపణల్ని తిరస్కరించి.. జరిమానాతో పాటూ శిక్ష విధించింది.