యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్ర విభజన నేపథ్యంలో సొంతంగా పార్టీ పెట్టి.. చతికిలపడిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ తెరపైకి రాబోతున్నారు. అప్పుడప్పుడు పుస్తకావిష్కరణ సభలకు హాజరు కావటం మినహా బయటకు పెద్దగా వచ్చింది లేదు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతుండటం.. తప్పనిసరిగా తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వం డిసైడ్ కావటంతో.. తనకు ఇష్టం లేకున్నా విభజన ప్రక్రియను చూస్తూ ఉండిపోయారు. గతంలో సీఎంలుగా ఉన్న వారెవరూ చేయని పనుల్ని తన హయాంలో చేసిన కిరణ్ ను రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు పలు సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉంటారు. దమ్ము అంటే కిరణ్ కుమార్ రెడ్డిదేనని పొగిడే వారు ఉన్నట్లే.. కిరణ్ కుమార్ తమను తీవ్రంగా అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసే వారు కనిపిస్తారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో.. కాంగ్రెస్ లో ఆయన చురుగ్గా పాల్గొంటారన్న మాట వినిపించినా.. గడిచిన కొన్ని నెలలుగా ఆయన సైలెంట్ గా ఉన్నారు.
రానున్న అసెంబ్లీ.. లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే వారు దరఖాస్తు చేసుకోవాలంటూ పార్టీ అధినాయకత్వం కోరింది.ఇందులో భాగంగా ఇప్పటివరకు 1271 మంది దరఖాస్తులు చేసుకునారు. వీరిలో 175 అసెంబ్లీ స్థానాలకు 1090 మంది.. 25 లోక్ సభ స్థానాలకు 181 మంది ఆశావాహులు టికెట్లు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే.. టికెట్లు ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న వారిలో కిరణ్ పేరు లేదని చెబుతున్నారు.దీంతో.. ఆయన కాంగ్రెస్ నుంచి దూరమయ్యారా? అన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు కిరణ్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరతారన్న వాదన వినిపిస్తోంది.ఇప్పుడున్న పరిస్థితుల్లో కిరణ్ కు రెండు మార్గాలు ఉన్నాయని.. ఒకటి టీడీపీలో చేరి చిత్తూరు జిల్లా పీలేరు నుంచి పోటీ చేయటం.. లేదంటే ఇప్పటివరకూ ఉన్నట్లుగా తెర వెనుక ఉన్నట్లుగా ఉండి.. తెర వెనుక రాజకీయం చేయటం మినహా యాక్టివ్ పాలిటిక్స్ లో పాల్గొనరని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి చరిత్రలో నిలిచిపోయారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. వ్యంగ్యంగా మాట్లాడటంతో పాటు.. కఠినమైన నిర్ణయాలు తీసుకోవటంలో సిద్దహస్తుడిగా పేరున్న ఆయన.. తన పాలనలో మార్క్ ను చూపించారని చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నా.. కిరణ్ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక కొలిక్కి రావటమే కాదు.. ఆయన మరికొద్ది కాలం ఉంటే.. చాలా బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమయ్యేది. మరి.. కిరణ్ అడుగులు ఎలా పడతాయో చూడాలి.