Highlights
- నీరవ్ కు సహకరించిన 'గీతాంజలి జెమ్స్' యజమాని మేహుల్ చౌక్సీ
- సీబీఐ దాడులతో స్టోర్స్ అన్నీ మూసివేత
- నిరసన బాటలో ఉద్యోగులు
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సహా దాదాపు 30 బ్యాంకులకు రూ. 17 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ వ్యాపార భాగస్వామి, ఆయన మేనమామ అయిన మేహుల్ చౌక్సీకి చెందిన 'గీతాంజలి జమ్స్' స్టోర్స్ దేశవ్యాప్తంగా మూతబడ్డాయి. నీరవ్ స్కామ్ బయటపడిన తరువాత గీతాంజలీ స్టోర్లపై సీబీఐ, ఈడీ దాడులు జరుపుతూ స్టోర్లలో ఉన్న ప్రతి ప్రొడక్టునూ సీజ్ చేస్తుండగా, రెండు రోజుల క్రితమే, ఉద్యోగులందరికీ నోటీసులు ఇచ్చిన సంస్థ, మరో ఉద్యోగాన్ని వెతుక్కోమని ఉచిత సలహా ఒకటి పారేసి చేతులు దులిపేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఉదయం కోల్ కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లోని గీతాంజలి జెమ్స్ స్టోర్ల మందు షట్ డౌన్ బోర్డులు పెట్టారు. దీంతో ఆ సంస్థలో పనిచేస్తున్న సుమారు 5 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డట్లయింది. గీతాంజలి అధికారిక వెబ్ సైట్ మూడు రోజుల క్రితమే మూతబడిన సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయాలని పలు ప్రాంతాల్లో ఉద్యోగులు స్టోర్ల ముందు బైఠాయించడంతో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.