యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైసీపీ అధినేత జగన్ అమరావతిలో నిర్మించిన కొత్త ఇల్లు ప్రారంభోత్సవం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 14న గృహప్రవేశం జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు వైసీపీ రాజకీయ వ్యవహరాల కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. జగన్ సోదరి షర్మిల దంపతులు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా గృహప్రవేశాన్ని వాయిదా వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకట విడుదల చేశారు. ఈ కార్యక్రమం మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామని సుబ్బారెడ్డి వివరించారు. జగన్ తన గృహప్రవేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను సైతం ఆహ్వానించారు. విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలకు కేసీఆర్ హాజరుకానున్నారు. పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆహ్వానం మేరకు కుటుంబ సమేతంగా విశాఖ వెళ్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొంటారని తెలుస్తోంది. దీంతోపాటు జగన్ గృహప్రవేశంలోనూ పాల్గొంటారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా జగన్ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. సుమారు రెండెకరాల విస్తీర్ణంలో వైసీపీ కార్యాలయం, ఇల్లు ఒకే ప్రాంగణంలో రూపుదిద్దుకుంటున్నాయి. విభజన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో నివాసం ఏర్పాటు చేసుకోగా, ఇటీవల జనసేన అధినేత పవన్ ఇల్లు, కార్యాలయం ఒకేచోట నిర్మించుకున్నారు. మరోవైపు బుధవారం ఒంగోలులో జరగాల్సిన ప్రకాశం జిల్లా సమర శంఖారావం సభ సైతం వాయిదా పడింది. మిగతా జిల్లాల్లో సభలను నిర్వహించే తేదీలపై ఫిబ్రవరి 17న ఏలూరులో జరిగే బీసీ గర్జన తర్వాతనే ఖరారుచేస్తారని పార్టీవర్గాలు తెలిపాయి.