YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రియాంక..ఊపిరిపోస్తారా

 ప్రియాంక..ఊపిరిపోస్తారా
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 
నిరాశా… నిస్పృహలతో వున్న కాంగ్రెస్ కి ఊపిరి పొసే బాధ్యతను నెత్తికెత్తుకున్నారు ప్రియాంక గాంధీ. సోదరుడిని ప్రధాని చేసే మిషన్ లో యుపి అత్యంత కీలకం కావడంతో ఆమె దిగిరాక తప్పలేదు. యుపిలో గాంధీ కుటుంబానికి ముఖ్యంగా ఇందిర తో అనుబంధం అంతా ఇంతా కాదు. ఇందిర కు ప్రతిరూపంగా ప్రియాంక ను అక్కడివారు భావిస్తారు. అత్యంత జనాకర్షక శక్తిగా వుండే ప్రియాంక ఇప్పుడు యుపి తూర్పు బాధ్యతలు అందిపుచ్చుకున్నారు.ఉత్తర ప్రదేశ్… దేశ రాజకీయాల్లో అధికారం దక్కాలన్నా… దూరం కావాలన్నా లెక్కలు సరిచేసే రాష్ట్రం. ప్రజాస్వామ్యంలో ప్రధానమైనది నెంబర్ గేమ్. పార్లమెంట్లో అత్యధిక స్థానాలు అందుకోవాలంటే ఒక్క యూపీని టార్గెట్ చేస్తే సరిపోతుంది. మెజారిటీకి అవసరమైన మూడో వంతు ఆ రాష్ట్రం నుంచే దక్కుతాయి. 80 స్థానాలతో ఉత్తరప్రదేశ్ 40పార్లమెంట్ స్థానాలతో బీహార్ దేశ రాజకీయాలను శాసిస్తున్నాయి. దాంతో జాతీయ పార్టీలకు ఈ సీట్లలో పాగా వేయడమే ప్రధాన లక్ష్యం. బిజెపి ఈ రెండు రాష్ట్రాల్లో బలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం అవసాన దశలో కొట్టుమిట్టాడుతోంది.మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తమ శతృత్వాన్ని పక్కన పెట్టి సమాజ్ వాదీ, బహుజన సమాజ్ వాదీ ల కలయిక కాంగ్రెస్ ను కలవరపాటుకు గురిచేస్తుంది. దీనికి తోడు ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ ను దూరంపెట్టేయడం తో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపికి ప్రత్యామ్నాయంగా ఉండటం ప్రాంతీయ పార్టీల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి మాత్రమే అన్నది స్పష్టం అయిపొయింది. రాహుల్ ను ప్రధానిని చేయాలన్న సోనియా గాంధీ కల ఈ నేపథ్యంలో గాలిలో దీపంలాగే మారిపోయింది.లక్నోలో ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టి కాంగ్రెస్ కార్యాలయం వరకు 25 కిలోమీటర్లుఓపెన్ టాప్ బస్సులో చిరునవ్వులు చిందిస్తూ సాగిపోయారు ప్రియాంక. ఆమె ర్యాలీకి ఊహించిన దానికన్నా మంచి రెస్పాన్స్ లభించింది. లక్నో వాసులను తన భారీ ర్యాలీతో ఆకట్టుకున్నారు ప్రియాంక. నాలుగురోజుల పాటు లక్నో లో ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఆమె. ప్రియాంక బసను సైతం సెంటిమెంట్ తో ముడి పెట్టింది కాంగ్రెస్. ఆమె నాయనమ్మ ఇందిర, తాతయ్య ఫిరోజ్ గాంధీ తరచూ లక్నో వచ్చి వెళ్ళినప్పుడు వినియోగించిన ఆఫీస్ నే  ఆమెకు కేటాయించింది లక్నో కాంగ్రెస్ కమిటీ. ఇలా ప్రతి అంశంలో ఇందిర ను గుర్తు చేసేలా చర్యలు తీసుకుంది. దాంతో కాంగ్రెస్ వర్గాల్లోనూ యుపిలో ఆ పార్టీకి ఒకప్పుడు చేదోడుగా నిలిచిన వారిలో కొత్త ఉత్సహాన్ని నింపింది. అయితే ఈ సెంటిమెంట్లు అన్ని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పై ఓట్లు కురిపిస్తాయా ? లేక సమాజ్ వాదీ, బహుజన సమాజ్ వాదీ లు తిరిగి హస్తాన్ని కలుపుకుని వెళ్ళే ఆలోచన కు తెరతీస్తాయా లేదా అన్నది త్వరలో తేలనుంది.

Related Posts