యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైసీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ రాజకీయం ఎలా ఉంది? ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన రాజకీయాలు చేస్తున్నారా? లేక వెనుక బడి పోతున్నారా? అనే ఆసక్తికర చర్చ తెరమీదకి వచ్చింది. ప్రతి విషయాన్ని రాజకీయాలని ఎవరూ కోరుకోవడం లేదు. అదేసమయంలో సమయం వచ్చినప్పుడు మౌనంగా ఉండాలని అనుకోవడమూ లేదు. కానీ, ఈ రెండు విషయాల్లోనే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించలేక పోతున్నారని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా 2015, 2016 సంవత్సరాల్లో ప్రధాన ప్రతి పక్షం నాయకుడిగా జగన్ వేసిన అడుగులు చాలా బాగున్నాయనే టాక్ వచ్చింది.అయితే, ఆ తర్వాత మాత్రం ఆయన వ్యూహాత్మకంగా వెనుకబడిపోయారని చెబుతున్నారు. దీనికి అనేక కారణాలు కూడా కనిపిస్తున్నాయి. పాదయాత్రను ప్రధాన అస్త్రంగా ఎంచుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టడంలేదు. అయితే, దీని కోసం ఉన్న దానిని చెడగొట్టుకుని ఆయన సాధించింది లేదు. తాను అసెంబ్లీకి వెళ్లలేదు సరే! కానీ, మిగిలిన తన ఎమ్మెల్యేలను కూడా సభకు హాజరుకాకుండా ఆయన అడ్డుకున్నారు. ఇది ప్రధాన తప్పిదం.ఇక, కేంద్రంపై పోరులో భాగంగా ఎంపీలతో రాజీనామా చేయించారు. దీనిని తనకు ప్లస్ అయ్యేలా ప్రచారం చేసుకోవడంలోనూ, ప్రజల్లో సానుభూతిని సంపాయించుకోవడంలోనూ జగన్ వెనుకబడిపోయారు. చంద్రబాబును విలన్‌గా చిత్రీకరించాలని భావించిన జగన్ వ్యూహం కూడా దాదాపు బెడిసి కొట్టింది. ఈ క్రమంలోనే ఆయన ఒంటరి అయిపోయారని కూడా అంటున్నారు పరిశీలకులు. మేధావిగా అపర చాణిక్యుడిగా గుర్తింపు పొందిన చంద్రబాబును ఎదుర్కొనడం అంటే మాటలు కాదు. కానీ, ఆ అవకాశం వచ్చిన ప్పుడు కూడా జగన్ ఉదారంగా దానిని వదులుకున్నారు. ప్రత్యేక హోదా విషయంలో భుజాన వేసుకుని తిరిగిన జగన్… చివరికి దీనిని తనకు అనుకూలంగా మార్చుకుని ఢిల్లీలో ధర్నాలు చేస్తున్న .. చంద్రబాబుకు కౌంటర్ ఇవ్వలేక పోతున్నారనేది ప్రధాన సమస్య. మరోపక్క, 2019 ప్రారంభంలోనే పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని ఇస్తానని చెప్పారు చంద్రబాబు కానీ, ఇది 2020 వరకు వచ్చినా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కాపులకు రిజర్వేషన్ విషయంలోనూ అగ్రవర్ణ పేదలకు కేంద్రం ఇచ్చిన 10% రిజర్వేషన్‌ను తనకు అనుకూలంగా మార్చుకున్నారు చంద్రబాబు. దీనిని కూడా జగన్ ఎండగట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇక, ప్రజాధనాన్ని తన సొంత ప్రచారానికి చంద్రబాబు వాడుతున్నారని ఢిల్లీ నుంచి వచ్చి మోడీ చెప్పే వరకు కూడా ప్రజల్లో పెద్దగా ప్రచారానికి నోచుకోలేక పోయింది. ఈ విషయంలోనూ జగన్ వెనుకబడ్డారు. ఇక, అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో చంద్రబాబు వ్యూహాలను అందిపుచ్చుకుని, ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలోనూ జగన్ వెనుక బడ్డారు. సో.. ఈ విఫల విషయాలపై ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు .