Highlights
- నాగం కాంగ్రెస్ తీర్థం
- ఢిల్లీలో రాహుల్‌తో భేటీ
భారతీయ జనతా పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా నాగం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలిసింది. గత కొంత కాలంగా నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని నాగం అసంతృప్తి ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.అంతేగాక, తన నియోజకవర్గంలోని తన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరుకుంటున్నారని గతంలో నాగం జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.ఈ నేపథ్యంలోనే నాగం బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది.
అయితే, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి మాత్రం నాగంకు బీజేపీలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని, చెప్పారు. కాగా, ఉస్మానియా మెడికల్ కాలేజీనుంచి వైద్యవిద్యలో పట్టా తీసుకున్న నాగం జనార్దన్ రెడ్డి మొదట తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా పని చేశారు. కాగా, నాగం 2013లో బిజెపిలో చేరారు.