యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు పోర్న్ సైట్ తెరవడం... శృంగార దృశ్యాలు చూడడం గత రెండేళ్లలో 75 శాతం పెరిగిపోయిందని హైదరాబాద్‌లో సర్వే నిర్వహించిన డాక్ సంస్థ పేర్కొంది. పోర్న్ సైట్లలో వచ్చే శృంగారానికి, నిజ జీవితంలో శృంగారానికి తేడా ఉండడంతో చాలామందికి సెక్స్‌పై ఆసక్తి తగ్గిపోతోందని ఈ సర్వేలో తేలింది. దీంతో అధిక శాతం మంది ఆసక్తి లేకుండానే శృంగారంలో పాల్గొంటున్నారని సర్వే రిపోర్టు చెబుతోంది. ఎప్పుడు చూసినా స్మార్ట్‌ఫోన్ చేతిలోనే ఉంటోంది. డాటా చార్జీలు తగ్గిపోయాయి. ఇంకేముంది. ఏది కావాలంటే అది ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేసి సులువుగా చూసుకునే రోజులు వచ్చాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరు పడితే వారు చూసే అవకాశం ఏర్పడింది. దీంతో చాలా మంది పోర్న్ చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పోర్న్ చూసే వారి సంఖ్య ఇటీవల ఎక్కువగా పెరిగిపోతోందని నిపుణులు పేర్కొంటున్నారు.
5 వేల మందితో సర్వే...
హైదరాబాద్‌లో డాక్ ఆన్‌లైన్ అనే సంస్థ ఇటీవల శృంగారం, పోర్న్ దృశ్యాలు చూస్తున్న వారిని సర్వే చేసింది. ఈ సర్వేలో పోర్న్ చూసేవారు దాదాపు 75 శాతం వరకు ఉంటున్నారని తేలింది. హైదరాబాద్‌లో ఐదు వేల మందిపై ఇటీవల సదరు సంస్థ సర్వే చేసి.. ఇందులో 18 నుంచి 50 ఏళ్ల లోపు వారి అభిప్రాయాలు సేకరించింది. ఈ సర్వేలో 3,500 మంది పురుషులు, 1,500 మంది మహిళలు పాల్గొన్నట్లు సంస్థ తెలిపింది. పోర్న్‌లో చూసిన విధంగా కొంత మంది ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో సురక్షిత సెక్స్ పద్ధతులను పాటించకపోవడంతో అనారోగ్యం బారిన పడడం, గర్భస్రావం చేయించుకోవడం వంటి సమస్యలు గుర్తించారు.