యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేన పార్టీ దూకుడు పెంచింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల నుంచి బరిలోకి దింపే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది. వివిధ స్థానాల నుంచి పోటీ చేయడానికి పలువురు ఆశావహులు మంగళవారం నుంచే దరఖాస్తు చేయడం ప్రారంభించారు. పార్టీ అధినేత పవన్ తొలి దరఖాస్తు సమర్పించి ఈ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. పలువురు మహిళలు, యువకులు పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు, వాటిపై స్క్రీనింగ్ ప్రక్రియ కూడా మొదలు పెట్టినట్లు పార్టీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న పార్టీ కార్యాలయంలో అభ్యర్థుల వడపోత ప్రక్రియ ప్రారంభించినట్లు స్క్రీనింగ్ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు జనసేన పార్టీ ట్వీట్ చేసింది. దరఖాస్తుల పరిశీలనకు ఐదుగురు సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. మాదాసు గంగాధరం ఈ స్క్రీనింగ్ కమిటీకి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. గంగాధరం నేతృత్వంలోని పార్టీ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల వడపోత ప్రక్రియను ప్రారంభించిందని జనసేన వెల్లడించింది. బుధవారం ఉదయం నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి ఆశావహలు పెద్ద ఎత్తున తరలివచ్చి దరఖాస్తులు సమర్పించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి