యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీకి ప్రత్యేక హోదా పోరులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వేదికగా సోమవారం దీక్ష చేశారు. ఈ ఒక్కరోజు దీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఖర్చుపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ఖర్చుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో కూడా బయటకొచ్చింది. దీక్ష ఖర్చు రూ.2 కోట్లు కాదు.. రూ.10 కోట్లని ప్రచారం జరిగింది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారట. రూ.10కోట్లు ఖర్చు అయ్యిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారట. ధర్మ పోరాట దీక్షకు రూ.10 కోట్ల ఖర్చు కాలేదని.. మొత్తం రూ.2కోట్ల 83 లక్షలు మాత్రం ఖర్చు చేశామన్నారు. రైళ్లకు రూ.కోటీ 23 లక్షలు, ఏపీ భవన్లో రూ.కోటీ 60 లక్షల వరకు ఖర్చయ్యాయని చెప్పుకొచ్చారట. ఆంధప్రదేశ్ ప్రయోజనాలు, ప్రత్యేక హోదా కోసం దీక్ష చేశామని.. ఢిల్లీని కదిలించామన్నారట. మోదీ గతంలో తన సొంతానికి దీక్ష చేసి రూ.80 లక్షలు ఖర్చు చేయలేదా అని చంద్రబాబు ప్రశ్నించారట. దీక్షపై విపక్షాలు చేస్తున్న ప్రచారంపై చంద్రబాబు కేబినెట్ భేటీలో చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాల విమర్శల్లో అర్థం లేదని.. రాష్ట్రం కోసం దీక్ష చేసినా విమర్శించడం ఏంటని మండిపడ్డారట. అలాగే ఈ భేటీలో త్వరలో అమరావతిలో నిర్వహించే ధర్మపోరాట దీక్షపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.