యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాఫెల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ‘కాంగ్రెస్’కు ప్రజలే బుద్ధి చెబుతారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాదన అబద్ధమని కాగ్ నివేదిక తేల్చిందని, ఎన్డీఏ ప్రభుత్వ నిర్దోషిత్వాన్ని ఈ నివేదిక రుజువు చేసిందని అన్నారు. రాఫెల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు, కాగ్ సంతృప్తి చెందిందని పేర్కొన్నారు.‘సత్యమేవ జయతే..’ అంటూ ఈ మేరకు అరుణ్ జైట్లీ వరుస ట్వీట్లు చేశారు. 2007లో యూపీఏ సర్కార్ డీల్ తో పోలిస్తే తక్కువ ధర, వేగవంతమైన డెలివరీ, మెరుగైన నిర్వహణ తమ డీల్ లో ఉందని స్పష్టం చేశారు. రాఫెల్’కు సంబంధించి సుప్రీంకోర్టు చెప్పింది తప్పు, కాగ్ నివేదిక తప్పు, కేవలం, ఆ వారసుడు చెప్పిందే నిజం అనడం సరికాదంటూ రాహుల్ గాంధీకి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘మహా ఝూట్ బంధన్’ అబద్ధాలు మరోసారి స్పష్టమయ్యాయని, ఇలాంటి అబద్ధాలతో దేశాన్ని పక్కదోవ పట్టించాలని చూపిన వారికి ప్రజాస్వామ్యం ఏ శిక్ష వేస్తుందని ప్రశ్నించారు.