యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తలపెట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన మమతా పార్లమెంటు ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం ఎదుట ప్రార్థన చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని మహాత్మను వేడుకున్నారు.అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి రాజకీయ పార్టీకి సొంత భావజాలం ఉంటుదని అన్నారు. తాము దేశభక్తిని విశ్వసిస్తున్నామని తెలిపారు. గాంధీ ముందు ప్రార్థన చేయడానికే తాను పార్లమెంటుకు వచ్చినట్టు పేర్కొన్నారు. బీజేపీని, నరేంద్ర మోదీని తొలగించి దేశాన్ని, ఐక్యతను కాపాడాలని గాంధీజీని ప్రార్థించినట్టు చెప్పారు. తమ ప్రభుత్వంపై కేంద్రం కక్ష సాధింపుకు పాల్పడుతుందని ఆరోపిస్తూ మమతా ఇటీవల మూడు రోజుల పాటు దీక్ష చేశారు. ధాని మోదీపై యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మోసం, బెదిరింపులే మోదీ ప్రభుత్వ విధానమని ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో ప్రజలు ఆశించిన ఫలితాలు నెరవేరలేదని, ప్రజలను మోసగించారని దుయ్యబట్టారు. పార్లమెంట్ సమావేశాలు కూడా సరైన రీతిలో జరపట్లేదని, ప్రతిపక్ష సభ్యులు తమ వాదనలు వినిపించేందుకు ఆస్కారం లేకుండా పోతోందని విమర్శించారు.దేశంలోని వ్యవస్థలను ప్రభుత్వం నాశనం చేసిందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించిందని, రాజ్యాంగబద్ధ విలువలు, సూత్రాలు, నిబంధనలపై మోదీ ప్రభుత్వం దాడి కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల్లో, జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితులు బాగా లేవని అన్నారు. దేశంలో రైతులకు, నిరుద్యోగులకు న్యాయం జరగట్లేదని విమర్శించారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సాధించిన గెలుపు తమలో నమ్మకాన్ని నింపిందని అన్నారు. తమ ప్రత్యర్థి పార్టీలు ఇంతకుముందు చాలా శక్తిమంతంగా ఉన్నట్టు కనబడ్డాయి కానీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ నేరుగా వారితో పోరాటం జరిపి, మన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారని అన్నారు. ఫ్రధాని మోదీకి కనీస పరిపాలనా సూత్రాలు కూడా తెలియవని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు చంద్రబాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, మోదీ పాలనలో ప్రాథమిక హక్కులు కోల్పోయామని విమర్శించారు. మోదీ పాలనలో నోట్ల రద్దుతో ప్రజలు నష్టపోయారని, ఆర్థిక రంగం కుదేలైపోయిందని, రైతులు, నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సహకార వ్యవస్థ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రాఫెల్ ఒప్పందంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించిన చంద్రబాబు, కేజ్రీవాల్ తన పరిపాలనతో ఢిల్లీలో అద్భుతాలు చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని పరిరక్షించాలని నినదించిన చంద్రబాబు, ఈ సభకు హాజరైన వారితో కూడా ఆ నినాదాలు చేయించారు.