యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మైండ్ గేమ్ లో మాస్టర్ ఏపీ సిఎం చంద్రబాబు. ఆ మధ్యన జనసేన అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేసి మైండ్ గేమ్ ఆడారు బాబు. పవన్ తో కలిస్తే తప్పేంటని…? జగన్ కేల బాధ అంటూ మొత్తం ఎపి రాజకీయాల్లో చర్చ లేపారు. అదిగో జనసేన, టిడిపి దోస్తీ బయటపడింది అంటూ వైసిపి అల్లరి చేస్తే మీతో ఎవరు కలుస్తారు ? పగటి కలలు మానుకోవాలంటూ జనసేన అధినేత ఘాటుగానే స్పందించారు. అయినా కానీ రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేసి అటు బాబు చేత ఇటు పవన్ చేత అక్షింతలు వేయించుకున్నారు.ఢిల్లీ లో ధర్మపోరాటానికి దిగిన చంద్రబాబును ఒక జాతీయ మీడియా ప్రతినిధి మహాకూటమిపై పలు ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం ఇస్తూ వైసిపి కూటమిలో చేరినా అభ్యంతరం లేదని ఆఫర్ ఇచ్చారు. జాతీయ ప్రయోజనాలకోసం వైసిపికి వచ్చే ఒకటి రెండు స్థానాలు వచ్చే ఎన్నికల తరువాత కూటమికి అవసరం అవుతాయనే రీతిలో సంచలన వ్యాఖ్యలే చేశారు. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.కెసిఆర్ తో థర్డ్ ఫ్రంట్ వైపు పడుతున్న వైసిపి అడుగులు గుర్తించి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారా లేక భవిష్యత్తులో కలగూరగంప సర్కార్ వస్తే ప్రధానిగా తనకు ఛాన్స్ వస్తే వైసిపి మద్దతును ముందే ఆహ్వానించారా ? లేక ఏపీలో జగన్ పార్టీకి 25 పార్లమెంట్ స్థానాలకు 20 కి పైనే వస్తాయంటూ జాతీయ మీడియా సంస్థలు ఇస్తున్న సర్వేలు తప్పని చెప్పక చెప్పారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన తాజా వ్యాఖ్యలు ఎపి లోని ప్రధాన పక్షాల్లో కూడా టాపిక్ గా నడుస్తుంటే ఇక సోషల్ మీడియా లో రకరకాల పోస్ట్ లతో నెటిజెన్స్ అన్ని పార్టీలను ఆడుకోవడం విశేషం.