YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు బాబు బాగా బిజీ

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు బాబు బాగా బిజీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన పరంగా పినిషింగ్ టచ్ పనుల్లో పడింది. ఓటరును తనవైపు తిప్పుకునే సంక్షేమ పథకాలను కొలిక్కి తెస్తోంది. వివిధ వర్గాలకు స్థలాలు, అదనపు ప్రయోజనాలకు సంబంధించీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. ఫిబ్రవరి 20 నుంచి వచ్చే నెల పదో తేదీలోపు పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు, ఇచ్చిన హామీలకు శంకుస్థాపనలు పూర్తి చేయాలని సంకల్పించారు. అడిగినవారికి ,అడగని వారికి ఆల్ ఫ్రీతో పాటు అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్న వాతావరణాన్ని క్రియేట్ చేసి ఎన్నికలకు వెళ్లే దిశలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు. మంత్రి మండలి సమావేశాలన్నీ రాజకీయ నిర్ణయాలతో హోరెత్తుతున్నాయి. గడచిన మూడు సమావేశాల్లోనూ అదే ధోరణి. ఇప్పుడు ఆ జోరు మరింత పుంజుకుంది. తాజా కేబినెట్లో వరాల వర్షం కురిసింది. ఎన్నికల ఏర్పాట్లు, ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, ప్రచారంలో ప్రజాభిప్రాయాన్ని మలిచే మీడియా వర్గాలకు స్థలాలు, రైతులకు అన్నదాతా సుఖీభవ వంటి పథకాల లక్ష్యం ఎన్నికలకు సిద్ధం కావడమే.అధికారంలో ఉండటం వల్ల కచ్చితంగా ప్లస్సులూ, మైనస్సులూ రెండూ ఉంటాయి. ప్రజలు నిత్యం అసంతృప్తిలో ఉంటారు. ఆశించినంత పనులు కావడం లేదని భావిస్తుంటారు. అవినీతితో ప్రతిపనికీ తమను దోచుకుంటున్నారని ఆవేదనలో ఉంటారు. ఇవన్నీ ప్రభుత్వవ్యతిరేకతను తెచ్చిపెట్టే మైనస్పులు. ప్రజలకు వివిధ రూపాల్లో వరాలు కురిపించి పథకాల రూపంలో డబ్బులు పంచిపెట్టే సర్కారీ సొమ్మును పార్టీ లబ్ధికి వినియోగించుకోవచ్చు. ప్రభుత్వానికి ఇది ప్లస్ పాయింట్. ఇప్పుడు అదే అస్త్రంతో గడచిన నాలుగున్నర సంవత్సరాల ప్రజా వ్యతిరేకతను పక్కనపెట్టేలా పావులు కదుపుతోంది ఏపీ సర్కార్. అధికారికంగా పార్టీ విడుదల చేసే ఎన్నికల ప్రణాళికకు ఒక నమూనా గా వివిధ పథకాలను గుదిగుచ్చి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టే అన్ని అంశాలను ముందుగానే అమలు చేసి చూపించాలనుకుంటున్నారు. వాటిని మరింత విస్తరిస్తామని ఎన్నికల ప్రణాళికలో చెబితే సరిపోతుంది. ప్రజల్లో ప్రభుత్వంపై కాన్ఫిడెన్స్ వస్తుంది. పునరధికారానికి మార్గం సుగమం అవుతుందని టీడీపీ అధినేత భావిస్తున్నారు. దీంతో కేబినెట్ సమావేశాల్లో చేతికి ఎముక లేదన్నట్లుగా పథకాలు ప్రకటిస్తున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు, వైసీపీ ఇప్పటికే ప్రకటించిన హామీలు, కేంద్రం అమల్లోకి తెస్తున్న పథకాలన్నిటినీ గుదిగుచ్చి ఏపీలో అమల్లోకి తెస్తున్నారు.డ్వాక్రా మహిళలు, అన్నదాత సుఖీభవ కింద రైతులకు భారీగానే లబ్ధి చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నారు . డ్వాక్రా మహిళలకు ఇప్పటికే మూడు విడతల చెక్కుల పంపిణీ మొదలైంది. కొన్ని జిల్లాల్లో తొలి చెక్కులను నగదుగా మార్చుకోవడమూ మొదలైంది. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా మారుతోందని ప్రభుత్వానికి పాజిటివ్ రిపోర్టులు అందుతున్నాయి. ఆ ఉత్సాహంతోనే రాష్ట్రంలోని 54 లక్షలమందికి కేంద్రప్రభుత్వంతో కలిపి తొలివిడతగా కుటుంబానికి అయిదువేల రూపాయల పెట్టుబడి సాయం, అయిదెకరాల పొలానికి మించి ఉన్న రైతులకు కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రమే తొలి విడత అయిదువేల రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అదే విదంగా పదిహేను లక్షల మంది వరకూ ఉండే కౌలు రైతులకూ అయిదు వేల రూపాయలు ఇస్తామంటోంది. నిజానికి కేంద్రప్రభుత్వం ఏడాదికి ఆరువేల రూపాయలు రైతులకు అందచేసేందుకు పథకం రూపకల్పన చేసింది. మూడువిడతలుగా దీనిని పంపిణీ చేయాలనుకుంటోంది. ఈ స్కీమ్ ను హైజాక్ చేసి మొదటివిడత కేంద్రం ఇచ్చే రెండువేలకు మరో మూడు వేలు కలిపి ఎన్నికల ఘడియల్లో అయిదువేలు రైతులకు చేరేలా చూడాలని సర్కారు భావిస్తోంది. మిగిలిన రెండు విడతల్లో కేవలం రెండువేల రూపాయలు మాత్రమే రాష్ట్రం కలుపుతుంది. తక్షణ ప్రయోజనం ద్రుష్టిలో పెట్టుకుని ఎన్నికల కోసం ఈ స్కీమ్ చెక్ ల పంపిణీ మార్చినెలలోనే మొదలైపోవాలని సర్కారు భావిస్తోంది.రైట్ మేన్, రైట్ ప్లేస్ అనే సాకుతో ఐఏఎస్, ఐపీఎస్, గ్రూపు ఒన్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. ఎమ్మార్వో, సీఐ స్థాయి అధికారి మొదలు జిల్లాకలెక్టర్, ఎస్పీల వరకూ ఎన్నికల విధుల్లో చాలా కీలకమవుతారు. గెజిటెడ్ హోదాలో శాంతిభద్రతలు, రెవిన్యూ విదులు నిర్వర్తించే దాదాపు రెండువేల మంది వరకూ అధికారులను మార్చి నెల మొదటివారంలోపు బదిలీ చేయవచ్చని అనధికారవర్గాల సమాచారం. తద్వారా తెలుగుదేశం పార్టీకి ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత ఇక కంటిమీద కునుకు ఉండనంత బిజీ కాబోతున్నారు. ఒకవైపు పార్టీని చక్కదిద్దుకుంటూ టిక్కెట్ల వ్యవహారాన్ని చూసుకోవాలి. అసంతృప్తులను సర్దుబాటు చేసుకోవాలి. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు సర్దుబాటు చేసుకోవాలి. బదిలీలు సహా ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ చేసుకోవడానికి పరిపాలనపరంగానూ చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలి.

Related Posts