Highlights
- సినీ స్టార్ పొలిటికల్ స్టారయేనా..?
- కలాం నివాసం నుంచి రాజకీయ యాత్ర
- చంద్రబాబు నా హీరో
- సినిమాలకు, రాజకీయాలకు పెద్ద తేడా లేదు
- నేను అంత్యక్రియలకు హాజరుకాను
- నా దగ్గర ఉన్న డబ్బంతా ప్రజలదే

ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తన రాజకీయ జైత్ర యాత్రను మొదలైంది. రామేశ్వరంలోని అబ్దుల్ కలాం నివాసం నుంచి కమల్‌హాసన్ రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలాం కుటుంబ సభ్యులతో అయన భేటీ అయ్యారు. బుధవారం ఉదయామే అయన రామేశ్వరం చేరుకున్నారు. యాత్రలో భాగంగా రామేశ్వరం, పరమకొడి, మదురైలో జరిగే బహిరంగ సభల్లో కమల్ పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం మదురైలో జరిగే సభలో పార్టీ పేరును, జెండా వివరాలను ప్రకటించనున్నారు. దీనితో కమల హాసన్ తన రాజకీయ ప్రస్థానం మొదలవుతుంది. ఈ పార్టీ ప్రారంభ వేడుకకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరు కానున్నారు.కేజ్రీవాల్ తో పాటు కేటీఆర్, రజనీకాంత్ , విజయ్ కాంత్ తదితర సెలబ్రిటీలను ఆహ్వానించారు
తమిళనాడులో ముందుగా ఊహించిన విధంగానే ఓ కొత్త రాజకీయ పార్టీకి అంకుర్పాణ జరుగబోతోంది. విలక్షణ నటుడు కమల్ హాసన్ తను నెలకొల్పబోయే రాజకీయ పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. తమిళ సినీ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి ఎంటరవుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తమిళ రాజకీయాల్లో కమల్ పార్టీ ప్రభావంపై పలు ఊహాగానాలూ వెలువడ్డాయి. అయితే .కొంత ఆలస్యమైనప్పటికీ కమల్ హాసన్ ముందడుగు వేసి నేడు తన రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు.
జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలు చిత్రమైన మలుపు తిరుగుతున్నాయి. జయలలిత మరణం తర్వాత రాజకీయంగా అక్కడ ఒక రకమైన శూన్యస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో అక్కడ ఇద్దరు సినీ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయరంగ ప్రవేశం చేస్తారని చాలా ప్రచారం జరిగింది. రజనీకాంత్ ప్రస్తుతానికి రాజకీయరంగ ప్రవేశం వాయిదా వేసినా కమల్ హాసన్ మాత్రం రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సమాయత్తమయ్యారు.
టాప్ స్టార్స్..
లోకనాయకుడు కమల్ హాసన్ విలక్షణ నటుడు. రజనీకాంత్ మాస్ పల్స్ ఉన్న హీరో. వీరిద్దరూ నటనలో కె. బాలచందర్ తీర్చిదిద్దిన శిల్పాలు. సినిమాల్లో టాప్ స్టార్స్ గా వెలుగుతున్న వీరు నిజ జీవితంలో మంచి మిత్రులు. అయితే ఇప్పుడు వీరిద్దరూ రాజకీయ పార్టీలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రభావం తమిళ రాజకీయాలపై ఏ విధంగా ఉంటుంది? ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చాక వారి మధ్య స్నేహ బాంధవ్యాలు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు తమిళనాడులో ఆసక్తికరంగా మారింది.
ఎన్నాళ్ళనుండో వేచి చూస్తున్న కమల్ రాజకీయ ప్రవేశానికి ఈ రోజు రంగం సిద్ధమైంది. రామేశ్వరంలోని అబ్దుల్ కలాం నివాసం నుంచి కమల్‌హాసన్ రాజకీయ యాత్రను ప్రారంభించారు. అబ్ధుల్ కలాం సోదరుడి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులని కలిసారు కమల్. యాత్రలో భాగంగా రామేశ్వరం, పరమకొడి, మదురైలో జరిగే బహిరంగ సభల్లో కమల్ పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం మదురైలో జరిగే సభలో పార్టీ పేరును, జెండా వివరాలను ప్రకటించనున్నారు. పార్టీ ప్రారంభ వేడుకకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరు కానున్నారు. ఇప్పటికే కమల్‌కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుండి సలహాలు తీసుకొని, తన పార్టీ కార్యాచరణకి సంబంధించి పూర్తి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కమల్ పార్టీ గుర్తు ఏమై ఉంటుంది. ఆయన విది విదానాలు ఏంటో మరి కొద్ది గంటలలోనే తెలియనుంది.
చంద్రబాబు నా హీరో: కమల్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా హీరో అని కమల్ హాసన్ అన్నారు. మంగళవారం రాత్రి చంద్రబాబు నాకు ఫోన్ చేశారు. ప్రజలకు ఏం చేయాలి అన్న విషయాల గురించి సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు.నేను మహాత్మా గాంధీ వీరాభిమానిని అని చెప్పారు. రామేశ్వరంలో మత్య్సకారులతో సమావేశమైన తర్వాత అయన స్థానిక హయత్ ప్లే్‌స్ హోటల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. కమల్ రాగానే అభిమానులు ‘సీఎం వచ్చారు’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ..రాజకీయ యాత్రలో భాగంగా కార్యకర్తలు, అభిమానులు నన్ను కలవడానికి వచ్చి శాలువాలు కప్పుతున్నారు. ఇంకెప్పుడూ ఇలా నాకు శాలువాలు కప్పవద్దు. నేను మీ శాలువాగా మారి మీకు రక్షణ కల్పిస్తాను.’
‘రామేశ్వరంలో కలాం చదివిన పాఠశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ పాఠశాల యాజమాన్యం నాకు అనుమతి ఇవ్వలేదు. పాఠశాలకు రానివ్వకుండా అడ్డుకోగలిగారు కానీ నేను నేర్చకోవాలనుకున్న విషయాలను మాత్రం అడ్డుకోలేరు. తమిళనాడు ప్రజల గుండెల్లో నేనున్నాను. ఇప్పుడు వారి ఇళ్లల్లోనూ ఉండాలనుకుంటున్నాను. సినిమాలకు, రాజకీయాలకు పెద్ద తేడా లేదు. రెండు రంగాలు ప్రజల కోసమే. కానీ సినిమాల కంటే రాజకీయాల్లో బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బంతా ప్రజలదే. కలాం చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలకు ఎందుకు రాలేదు అని చాలా మంది అడుగుతున్నారు. సాధారణంగా నేను అంత్యక్రియలకు హాజరుకాను.’ అని చెప్పుకొచ్చారు కమల్.
పలు కార్యక్రమాల వలన పార్టీ లాంచింగ్ కి హాజరు కాలేకపోతున్న కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. మధురైలో జరిగే మీ పార్టీ లాంచింగ్ కి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అనివార్య కారణాల వలన ప్రారంభోత్సవానికి రాలేకపోతున్నాను. కొత్త ఇన్నింగ్స్ లోను మీరు రాణించాలి. రీల్ నాయకన్ గానే కాదు రియల్(జన జీవితంలోను) నాయకన్ గాను మీరు రాణిస్తారని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు. దీనికి కమల్ థ్యాంక్యూ కేటీఆర్ జీ. ఈ రోజు మిమ్మల్ని మిస్ అయిన, భవిష్యత్ లో మా పార్టీ ఫంక్షన్స్ కి హాజరు అవుతారని ఆశిస్తున్నాను. మీ బిజీ షెడ్యూల్ మధ్య మాకు కొంత సమయం కేటాయించండి అని కమల్ రీ ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ కొత్త పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు అని సమాధానం ఇచ్చారు.