యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
భారీ వర్షం మూలంగా ప్రధాని నరేంద్రమోదీ దాదాపు నాలుగు గంటల పాటు విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. గురువారం ఉత్తరాఖండ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఆయన డెహ్రడూన్‌లోని జోలీ గ్రాన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆయన విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేందుకు వీలు పడలేదు. దీంతో మోదీ నాలుగు గంటల పాటు విమానాశ్రయంలోనే వేచి ఉన్నారు. వాతావరణ పరిస్థితి మెరుగుపడటంతో ఆయన విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు.విమానాశ్రయంలోనే ఓ ప్రత్యేక గదిలో మోదీ వేచి ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లో ఆయన ఉదయం పూట పర్యటన అనధికారికం కావడంతో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు రాష్ట్ర గవర్నర్ బేబే రాణి మౌర్య లేదా ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ విమానాశ్రయానికి రాలేదు. రుద్రపూర్‌లోని ఉద్ధమ్ సింగ్ నగర్ జిల్లాలో రూ.3,400 కోట్లతో దేశంలోని తొలి ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్(ఐసీడీపీ)ను మోదీ ప్రారంభించాల్సి ఉండగా.. వర్షం కారణంగా ఆలస్యమైంది. ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు.