యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తాము అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు రెడీ అయ్యాయి. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 19 నుంచి ‘ప్రత్యేకహోదా భరోసా యాత్ర’ను నిర్వహిస్తామని తెలిపారు.ఈ భరోసా యాత్ర అనంతపురంలోని మడకశిర నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకూ సాగుతుందని వెల్లడించారు. 25 లోక్ సభ స్థానాలు, 75 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ భరోసా యాత్ర సాగుతుందని పేర్కొన్నారు. ఈ యాత్రకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతారని తులసి రెడ్డి అన్నారు.