యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన జరిగింది. గురువారం తుళ్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ దంపతులు శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. మంత్రులు నారా లోకేష్, ప్రత్తిపాటి, నక్కా ఆనందబాబు, ఫరూక్, ఎంపీ కొనకళ్ల నారాయణలతో పాటూ పలువురు నేతలు పాల్గొన్నారు. బసవతారక ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాలను కేటాయించింది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఏపీలోనూ సేవలందించాలనే ఉద్దేశంతో ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ హాస్పిటల్‌ను వెయ్యి పడకలతో మూడు దశల్లో నిర్మించనున్నారు. గత ఏడాది జూలైలో విజయవాడలోని సూర్యరావు పేటలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. వారంలో రెండు రోజులపాటు డాక్టర్లు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అమరావతిలో ఏర్పాటవుతోందని ముఖ్యమంత్రి @ncbn తెలిపారు. హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన 1000 పడకలతో ఇది రూపుదిద్దుకోనుందని అన్నారు.ఎన్టీఆర్ భార్య బసవ తారకం క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఆమె పడిన ఇబ్బందులు మరొకరు పడకూడదనే తపనతో హైదరాబాద్‌లో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు అంకురార్పణ చేశారు. 2000లో నాటి ప్రధాని వాజ్‌పేయి చేతుల మీదుగా హైదరాబాద్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి తక్కువ ఖర్చుతోనే ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య ఖర్చులు చెల్లించే స్థోమత లేని వారికి ఉచిత వైద్యంతో పాటు కార్పస్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు