YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

అధికారుల అలసత్వం..ముందుకు సాగని చదువులు

అధికారుల అలసత్వం..ముందుకు సాగని చదువులు

అనంతపురం జిల్లాలోని ఆదర్శ పాఠశాలల  అమలులో మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అనే చందంగా తయారైంది. ఓ వైపు ఉపాధ్యాయుల కొరత వెక్కిరిస్తుంటే, మరోవైపు ఉన్న సిబ్బంది మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ ప్రభావం విద్యార్థుల చదువుపై పడుతోంది. ప్రతిభ ఉండి ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమవుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2012–13లో ‘మోడల్‌’ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. వసతితో పాటు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకునే అవకాశం రావడంతో గ్రామీణ విద్యార్థులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీటి ఏర్పాటు వెనుక ప్రభుత్వ ఆశయం బాగుంది కానీ,. చాలా స్కూళ్లలో  రాజకీయ జోక్యం అధికమవుతోంది. దీంతో పర్యవేక్షించాల్సిన అధికారులు కఠినత్వం ప్రదర్శించలేకపోతున్నారు. ఫలితంగా ఉద్యోగులు ఆడిందే ఆడ పాడిందే పాట చందంగా వ్యవహరిస్తున్నారు. ఉన్న ఉపాధ్యాయులైనా విద్యార్థుల బోధనపై దృష్టి సారిస్తున్నారంటే అదీలేదు. చాలా స్కూళ్లలో ఆధిపత్యపోరుతో విద్యార్ధుల చదువును గాలికొదిలేశారు. కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, విడపనకల్లు, యాడికి, పుట్లూరు తదితర స్కూళ్లలో రాజకీయాలు మరీ ఎక్కువయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎంతసేపు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేసుకోవడం తప్ప చదువు గురించి పట్టించుకోవడం లేదంటున్నారు. ప్రిన్సిపాళ్లు, పీజీటీలు, టీజీటీలు ‘ఎవరికివారు యమునా తీరే’ చందంగా వ్యవహరిస్తున్నారు. కొందరు రాజకీయ నాయకుల అండతో అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ కింద నియామకమైన వార్డెన్లు కూడా రాజకీయాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రాత్రి పూట ఉండి విద్యార్థులతో చదివించాల్సి ఉంది. చాలాచోట్ల వార్డెన్లు రాత్రిపూట ఉండడం లేదు. ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీలు కూడా స్కూల్‌కు 8 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాల్సి ఉన్నా.. చాలామంది జిల్లా కేంద్రం, ఇతర పట్టణాల నుంచి రోజూ వెళ్లి వస్తున్నారు.మోడల్‌ స్కూళ్లలో హాస్టల్‌ వసతి ఉంటుందని ప్రారంభంలో ప్రకటించడంతో  విద్యార్థులు పోటీ పడి దరఖాస్తు చేసుకున్నారు. విపరీతమైన డిమాండ్‌ నెలకొనడంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం సిఫార్సు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తర్వాత విద్యార్థినులకు మాత్రమే వసతి కల్పిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం 9 నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థినులకు మాత్రమే వసతి కల్పిస్తున్నారు. వసతి లేమి, ఉపాధ్యాయుల కొరత, ఉన్న ఉపాధ్యాయుల్లో సమన్వయం లేకపోవడంతో చదువుకునేందుకు విద్యార్థులు, చేర్పించేందుకు తల్లిదండ్రులు అయిష్టత చూపుతున్నారు. ఒక్కో పాఠశాలలో 6 నుంచి ఇంటర్‌ దాకా 560 మంది చొప్పున 25 స్కూళ్లలో 14వేల మంది ఉండాల్సి ఉండగా.. కేవలం 10468 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 3,532 సీట్లు ఖాళీగా ఉండటం గమనార్హం. 

Related Posts