యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అనకాపల్లి ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత అవంతి శ్రీనివాస్ పార్టీ మారడం వెనక చాలా కారణాలున్నాయి. ప్రధానంగా ఆయన పార్టీ మారే ముందు టీడీపీ అధినేత చంద్రబాబుతో పలుమార్లు భేటీ అయ్యారు. అయితే అవంతి డిమాండ్లకు చంద్రబాబు ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. అవంతి శ్రీనివాసరావు గత కొంతకాలంగా పార్టీలో అసంతృప్తి ఉన్నారు. ఆయన అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన మనసంతా భీమిలీ నియోజకవర్గంపైనే ఉంది. అయితే ఇప్పటికే అక్కడ మంత్రి గంటా శ్రీనివాసరావు తిష్ట వేసి ఉండటంతో భీమిలి నియోజకవర్గం టిక్కెట్ టీడీపీలో ఉంటే దక్కే అవకాశం లేదు. టీడీపీ నుంచి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి వస్తుందని భావించిన అవంతి శ్రీనివాస్ అందుకు సుముఖంగా లేరు. మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టం లేదు. ముఖ్యంగా ఈసారి ఎంపీగా పోటీ చేసినా గెలిచే ఛాన్సులు తక్కువని ఆయన అంచనా. విశాఖ రైల్వే జోన్ సాధించుకోలేకపోవడం, అధికార తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత పెరిగిపోవడంతో అవంతి ఇక పార్టీలో ఉండటం వేస్ట్ అని నిర్ణయానికి వచ్చారు. తొలుత ఆయన జనసేన వైపు చూశారని తెలుస్తోంది. జనసేన ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలోపేతం కాకపోవడంతో ఆ పార్టీలోకి వెళ్లినా ప్రయోజనం లేదని భావించారు. అందుకే ఆయన వైసీపీని ఆప్షన్ చేసుకున్నారు. వైసీపీలో ఇప్పటి వరకూ విశాఖపట్నం జిల్లాలో సరైన నాయకుడు లేరు. గత ఐదేళ్లుగా నాయకత్వ సమయ్యతో విశాఖ జిల్లాలో వైసీపీ కూనారిల్లుతోంది. కనీసం చెప్పుకోదగ్గ స్థాయి నేత కూడా ఆ పార్టీ లో లేరు. దీంతో వైసీపీలోకి వెళితే భీమిలీ టిక్కెట్ దక్కడంతో పాటు జిల్లాలో తిరుగులేని నేతగా పార్టీలో ఎదగవచ్చన్నది అవంతి శ్రీనివాస్ ఆలోచనగా ఉంది.2009లో భీమిలి నుంచి అవంతి శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచారు. ఆయన నిన్న మొన్నటి వరకూ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. అయితే కొద్దికాలంగా జిల్లాలో గంటా పెత్తనం పెరిగిపోవడాన్ని అవంతి జీర్ణించుకోలేకపోయారు. టీడీపీలో ఉంటే రాజకీయంగా తనకు ఎదుగుదల ఉండదని భావించిన అవంతి శ్రీనివాసరావు పార్టీ మారడానికి నిర్ణయించుకున్నారు. పార్లమెంటు సమావేశాలు పూర్తి కావడంతో ఆయన నేరుగా జగన్ తో భేటీ అయి పార్టీ కండువాను కప్పుకున్నారు. మొత్తం మీద అవంతి శ్రీనివాసరావు వైసీపీలో విశాఖ జిల్లాలో కీలక నేతగా ఎదగబోతున్నారు.