యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ-2018 రాతపరీక్ష ఫలితాలు (మెరిట్ జాబితా) శుక్రవారం (ఫిబ్రవరి 15) విడుదలయ్యాయి. మధ్యాహ్నం 1.25 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ ఫలితాలను విడుదల చేశారు. జిల్లాలు, సబ్జెక్టుల వారీగా డీఎస్సీ మెరిట్ జాబితాను ప్రకటించారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, స్పెషల్ స్కూల్ టీచర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,902 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతేడాది అక్టోబరులో డీఎస్సీ-2018 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదట 7,729 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్‌లో అదనంగా 173 పోస్టులు చేర్చడంతో.. మొత్తం పోస్టుల సంఖ్య 7,902 కి చేరింది. మొత్తం పోస్టుల్లో.. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల పరిధిలో 4,341 పోస్టులు; మున్సిపల్ పాఠశాలల పరిధిలో 1,100 పోస్టులు; ఆదర్శ పాఠశాలల్లో 909 పోస్టులు; గిరిజన పాఠశాలల్లో 800 పోస్టులు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 175, బీసీ సంక్షే పాఠశాలల్లో 404 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు 6,08,155 మంది దరఖాస్తు చేసుకోగా.. 5,05,547 మంది పరీక్షలకు హాజరయ్యారు. షెడ్యూలు ప్రకారం.. అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజెస్) పోస్టులకు గతేడాది డిసెంబరు 24, 26, 27 తేదీల్లో; స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) పోస్టులకు డిసెబరు 28న; పీజీటీ పోస్టులకు డిసెంబరు 29న; టీజీటీ పోస్టులకు డిసెంబరు 30, జనవరి 1న పరీక్షలు నిర్వహించారు. ఇక ప్రిన్సిపల్ పోస్టులకు జనవరి 2న, లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు జనవరి 3న, ఎస్జీటీ పోస్టులకు జనవరి 18 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించారు.