యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
లోటు బడ్జెట్తో ప్రయాణం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని అభివృద్ధిలో దేశంలోనే నెంబర్వన్గా నిలిపిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెల్లిందని పంచాయతీరాజ్, ఐటీశాఖా మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఓ వైపు రాష్ర్ట అభివృద్ధి, మరోవైపు ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నసీఎం..68 ఏళ్ల వయస్సులోనూ రాష్ర్టం కోసం యువకుడిలా కష్టపడుతున్నారని కొనియాడారు. కృష్ణా జిల్లా
నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం పొన్నవరం లో మంత్రి నారా లోకేశ్ శుక్రవారం పర్యటించారు. గ్రామంలోకి యువ మంత్రి అడుగుపెట్టగానే ప్రజలు,తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సిఆర్డిఏ నిధులు రూ. 50 లక్షలతో సుందరీకరణ పూర్తి చేసుకున్న ఊరచెరువును మంత్రి సందర్శించారు. ఏపీఎస్ఐడీసీ నిధులు రూ.50 లక్షలతో నిర్మాణమైన గండేపల్లి లిఫ్ట్ నుంచి పొన్నవరం ఊర చెరువుకు నీరందించే ఎత్తి పోతల పథకాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం గ్రామానికి చెందిన 370 మందికి పసుపు,కుంకుమ పధకంలో భాగంగా మంజూరైన రూ.37 లక్షలను పంపిణీ చేశారు. గ్రామంలో 10 డ్వాక్రా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ. 70 లక్షలను ఆయా గ్రూపులకు అందజేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ లోటుబడ్జెట్ తో ఏర్పడిన రాష్ర్టాన్ని...సమర్థవంతంగా పరిపాలిస్తూ ప్రజలకు ఏ లోటూ రాకుండా చూసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నూతలపాటి వెంకటరమణను అందించిన గ్రామం... ఎంతో మంది ప్రముఖులను అందించిందన్నారు. మంత్రి దేవినేని ఉమా, ఎంపీ సుజనా చౌదరి అమ్మమ్మ ఊరు ఇదే కావడం విశేషమన్నారు. గ్రామం అన్నిరంగాలలో అభివృద్ధి చెందడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరులశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీలు సుజనా చౌదరి, కేశినేని నాని, జడ్పి చైర్పర్సన్ గద్దె అనురాధ, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్థానిక నాయకులు పాల్గొన్నారు.