యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
చదువులో మంచి ప్రతిభ చూపి ఉత్తీర్ణులై డాక్టర్లుగా జీవితంలో స్థిరపడాలని ఫాతిమా బాధిత విద్యార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఫాతిమా బాధిత విద్యార్థులకు రూ.13 కోట్ల మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫాతిమా వైద్య విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో ఫాతిమా వైద్య విద్యార్థులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు. మంత్రులు ఫరూఖ్, ఆదినారాయణరెడ్డి, కడప తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిల వెంట ఫాతిమా వైద్య విద్యార్థులు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. కడప ఫాతిమా వైద్య కళాశాల బాధిత విద్యార్థులకు ‘రీఎంబర్స్మెంట్’ కింద రూ.13 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులివ్వడంలో ఉదారత, మానవతాదృక్పథంతో వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫాతిమా వైద్య విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. 2015-16 సంవత్సరంలో చేరిన ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులను కొన్ని సాంకేతిక కారణాలతో సంబంధిత కాలేజీని అనర్హత కింద నిషేధించారు. అప్పటి నుంచి ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు పలు పోరాటాలు చేసినా ఫలితం లేకపోయింది. ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు. ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల బంగారు భవిషత్తును తీర్చిదిద్దడానికి చొరవ తీసుకున్నారు. ఫలితంగా 2018 నీట్లో అర్హత సాధించి ‘బి’ కేటగిరిలో చేరినట్లయితే వారికి రెండేళ్ల పాటు ఈ రూ.13కోట్ల నుంచి ఫీజు చెల్లించడానికి నిర్ణయించారు. ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల అంశాన్ని ప్రత్యేక కేసు కింద ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిధుల ద్వారా ఈ చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తదుపరి పరిణామంలో నీట్లో ఉత్తీర్ణత సాధించిన 42 ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల రెండు సంవత్సరాల ఫీజు కింద రూ.13 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది