యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మహుతి దాడిలో వీరమరణం పొందిన అమర జవాన్లకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. బుడ్గామ్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో ఉంచిన అమరవీరుల శవపేటికల వద్ద రాజ్‌నాథ్ పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. రాజ్‌నాథ్‌తో పాటు జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, ఆర్మీ నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ అమరులకు నివాళులర్పించారు. అనంతరం మృతదేహాలను స్వస్థలాలకు పంపించడానికి ఆర్మీ వాహనాల్లోకి ఎక్కించారు. ఈ సమయంలో ఒక అమరవీరుడి శవపేటికను జవానులు, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బగ్ సింగ్‌తో కలిసి రాజ్‌నాథ్ సింగ్ మోసుకొచ్చారు. బరువెక్కిన గుండెతో శవపేటికను వ్యాన్‌లోకి ఎక్కించారు. మృతదేహాలను వ్యాన్‌లోకి ఎక్కించే సమయంలో ‘వీర్ జవాన్ అమర్ రహే’ అంటూ తోటి జవానులు నినాదాలు చేశారు.
కాగా, పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ఉగ్రదాడిలో ఇప్పటి వరకు 42 మంది జవానులు అమరులైనట్లు సీఆర్పీఎఫ్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ దాడిపై గురువారం మీడియాతో మాట్లాడిన హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఇదొక పిరికిపంద దాడిగా అభివర్ణించారు. దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అమరులైన జవాన్లకు దేశం నివాళులర్పిస్తుందన్నారు.