
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జయరాం హత్య కేసు విచారణలో మరో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. చిగురిపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి పూటకోమాట చెబుతూ కేసుపై అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాడు. జయరాం హత్యపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్న అధికారులను సైతం ఈ కేసు గందరగోళంలోకి నెడుతోంది. తనను వదిలేస్తే రూ. 10 కోట్లు ఇస్తానని జయరాం బతిమాలగా లేదులేదు నిన్ను చంపితే రూ. 100 కోట్లు వస్తాయని తాను అన్నట్టుగా పోలీస్ విచారణలో ఇచ్చిన వాంగ్మూలంలో రాకేష్‌రెడ్డి పేర్కొన్నాడు. మరో వైపు జయరాం ను చంపింది ముగ్గురా..ఐదుగురా అనే విషయం తేల్చేందుకు పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. రాకేష్ రెడ్డి, శ్రీనివాస్, విశాల్ కలిసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. కాగా మిగతా ఇద్దరి పాత్ర ఏమిటి అనే విషయం తేలాల్సి ఉంది.రౌడీ షీటర్ నగేష్ మేనల్లుడు పాత్ర గురించి పోలీసు విచారణలో బయట పడింది. విశాల్ లైఫ్ సెటిల్ చేస్తానని నమ్మించి రాకేశ్ అతన్ని జయ్ రామ్ హత్యలో బాగస్వామిని చేసినట్లు సమాచారం. జయ్‌రాం హత్య ప్లాన్ విషయం తెలుసుకున్న నగేశ్ రాకేష్ ఇంటి నుంచి పారి పోయాడా, సీన్‌లో ఉన్నాడా అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. నందిగామ పోలీసులు జయరాం హత్య కేసును తూ.. తూ.. మంత్రంగా విచారణ చేసి హైదరాబాద్ పోలీస్ లకు బదిలీ చేసినట్లు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో జయరాంను హత్య చేయడానికి ఎవరైనా రాకేష్‌రెడ్డిని ఉపయోగించుకున్నారా? అన్న కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంటరాగేషన్‌లో వ్యక్తుల పేర్లు, ఊర్లపేర్లు మార్చుతూ పోలీసులను సైతం రాకేష్‌రెడ్డి తికమక పెడుతున్నాడు. జయరాం హత్యకు ముందు తన ఇంట్లో 19 గంటల పాటు నిర్బంధంలో ఉంచానని నిందితుడు చెప్పాడు. దీంతో రాకేష్‌రెడ్డి వ్యవహారంపై ఇంకా లోతుగా విచారణ చెపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం పోలీస్‌లు రాకేష్‌రెడ్డి, శ్రీనివాసులను విచారిస్తున్నారు. గత రెండు రోజుల నుంచి శిఖా చౌదరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. శిఖా చౌదరికి ఖరీదైన కారు కొనుక్కోవడానికి రూ. 1.50 కోట్లు ఇచ్చానని, తన డబ్బులు తిరిగి ఇవ్వనందుకు శిఖా చౌదరి వద్ద ఉన్న కారును తానే ఎత్తికెళ్లినట్లు రాకేష్‌రెడ్డి పోలీసులకు వివరించారు.రాకేష్‌రెడ్డి తన కారును తీసుకెళ్ళినట్లు శిఖా చౌదరి జయరాంకు చెప్పారు. అయితే కారు డబ్బులు తానే చెల్లిస్తానని జయరాం ఒప్పుకున్నారని శిఖా చౌదరి పోలీసులకు చెప్పారు. జయరాం హత్యకు ముందు ఖాళీ బాండ్లపై సంతకాలు చేయించుకున్నానని, ఈ విషయాలను జయరాం భార్య పద్మశ్రీకి చెప్పి డబ్బులు వసూలు చేయాలని అనుకున్నానని రాకేష్‌రెడ్డి పోలీసులకు చెప్పారు. జయరాం నుంచి డబ్బులు వసూలు చేయడానికి వారి ఇంటి వద్ద నిఘా ఉంచానని రాకేష్ చెప్పాడు. సనత్‌నగర్‌కు చెందిన రౌడీ షీటర్ నగేశ్‌తో ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయన్న అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి రాకేష్‌రెడ్డి లావాదేవీలపై సైతం దర్యాప్తు చేస్తున్నారు. జయరాం హత్య తర్వాత 11 మంది పోలీస్ అధికారులతో రాకేష్‌రెడ్డి జరిపిన వాట్సాప్ చాటింగ్ సమాచారాలను పరిశీలిస్త్తున్నారు. ఈ కేసులో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలతో ఇప్పటికే ఇద్దరు అధికారులపై బదిలీ వేటు పడింది. మరో 9 మంది అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు సిద్ధం అవుతున్నారు