యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తాజా ఉగ్రదాడికి బదులు తీర్చుకోనుందా? ఉరీ దాడికి ప్రతీకారంగా పాక్ ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్ చేపట్టిన ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ఏం చేయబోతోంది ? ఒకవైపు జవాన్ల కుటుంబాల ఆర్తనాదాలు.. మరో వైపు ప్రతిపక్షాల విమర్శలు.. వీటి నడుమ కేంద్రం ఎలాంటి స్టెప్ తీసుకోనుంది? పుల్వామా ఉగ్రదాడి విషయం తెలియగానే యావత్ దేశం ఉలిక్కిపడింది.జమ్మూ కాశ్మీర్ పుల్వారా లో జరిగిన ఆత్మాహుతి దాడి దేశం మొత్తాన్ని షాక్ కి గురిచేసింది. ఈ దాడిలో 44 మంది జవాన్ల మృతి చెందడం అనేకమంది తీవ్రంగా గాయపడటం తెలిసిందే. దీనికి ప్రతీకారం తప్పనిసరిగా ఉంటుందన్న హోం మంత్రి రాజ్ నాధ్ వ్యాఖ్యలు సైనికుల మనోస్థర్యాన్ని పెంచేదే. అయితే ఆయన వ్యాఖ్యల్లో పాక్ పై మరోసారి దాడులు తప్పవన్న ధ్వనులు ధ్వనిస్తున్నాయి. దాంతో దేశంలోని పాక్ సరిహద్దు ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఏక్షణంలో ఏమి జరుగుతుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది.మోడీ సర్కార్ వచ్చాక సర్జికల్ స్ట్రైక్స్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. వచ్చేవి సార్వత్రిక ఎన్నికలు కావడంతో పాక్ తో తీవ్రస్థాయిలో పోరాడుతున్నామనే భావన అధికారంలో వున్న మోడీ సర్కార్ కి ఒక రకంగా లబ్ది చేకూర్చేది. గతంలో కార్గిల్ వార్ లో విజయం తరువాత వాజపేయి తిరిగి అధికారం సాధించారు. ఇదే సూత్రం మోడీ కూడా అమలు చేస్తారనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారుప్రభుత్వ వ్యతిరేకత నుంచి దేశభక్తి అంశానికి ఇలాంటి సమయాల్లో భారతీయులు ప్రధానంగా ప్రధమ ప్రాధాన్యత ఇస్తారని గత చరిత్ర స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సంఘటనల నేపథ్యంలో ఏ క్షణంలో ఏమి జరుగుతుందో చెప్పడం కష్టమే. మరోపక్క ముష్కరుల దారుణ దాష్టికాన్నీ దేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తోంది. ఉగ్రవాదులకు సరైన జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తుంది. మోదీ ఈ దాడి పట్ల ఫైరయ్యారు. పాక్ కు తగిన గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. మరి మోడీ సర్కార్ ఎలాంటి జవాబు చెబుతుందో వేచి చూడాలి ప్రధాని మోడీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. జవాన్ల ప్రాణ త్యాగం వెలకట్టలేనిదని, ఆ త్యాగం వృథా కానివ్వబోమని ప్రధాని ట్విటర్లో పేర్కొన్నారు. ప్రధాని ఆదేశాలతో రంగంలోకి దిగిన దోవల్ గురువారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వారి నుంచి వివరాలు తెప్పించుకున్నారు.కొంతకాలంగా ఉనికిలో లేకుండా పోయిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ మళ్లీ ఈ దాడితో తెరపైకి రావడం కలకలం సృష్టిస్తోంది. జైషే మహ్మద్ మూలాలు పాకిస్థాన్ కేంద్రంగా ఉన్నాయని భద్రతా బలగాలు చెప్తున్నాయి. కశ్మీర్లోని యువతకు జైషే మహ్మద్ సంస్థ వలవేసి ఉగ్ర చర్యలకు ఉసిగొల్పుతోంది. సూసైడ్ బాంబర్ ఆదిల్ కూడా అలానే సంస్థలో చేరాడు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న ప్రాంతాల్లో బలగాలు సోదాలు మొదలు పెట్టాయి. అణువణువునూ గాలిస్తున్నాయి. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నాయి. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.ఉగ్రదాడి నేపథ్యంలో మరో సారి సర్జికల్ స్ట్రయిక్ చేయాల్సిందేనన్న వాదన వినిపిస్తోంది. ఆలస్యం చేస్తే ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఉగ్రదాడి మోడీ సర్కార్ను ఇబ్బందుల్లో పడేసింది. పెద్ద నోట్ల రద్దు, తాము అనుసరిస్తున్న విదేశీ విధానం ఫలితంగా దేశంలో ఉగ్ర చర్యలు తగ్గిపోయాయని కొంత కాలంగా సర్కార్ పెద్దలు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ దాడి జరగడంపై ప్రభుత్వాన్ని అన్నివర్గాలు వేలెత్తి చూపుతున్నాయి . దీని నుంచి బయటపడాలంటే.. తక్షణంగా ఏదో ఒక స్టెప్ తీసుకోవాల్సిందేనని కేంద్రం భావిస్తోంది. 2016 సెప్టెంబర్ 29న పాక్ ఉగ్రస్థావరాలపై జరిగిన సర్జికల్ స్ట్రయిక్ ను నడిపించిన వారిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఒకరు. ఇప్పుడు ఆయనే రంగంలోకి దిగడంతో ఉగ్రవాదులను అణచేందుకు కేంద్రం భారీప్లాన్ వేసినట్లు అర్థమవుతోంది.